మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్‌పై సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్‌తో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.సమ్మక్క–సారలమ్మ పూజారుల సూచనల మేరకు రూపొందించిన మేడారం దేవాలయ ప్రాంగణ నూతన డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. అవసరమైన మార్పులపై చర్చించి తగిన సూచనలు చేశారు. జాతర ప్రారంభానికి ముందే అన్ని పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. భక్తుల దర్శనార్థం గద్దెలను ఒకే వరుసలో అమర్చేలా, ఎత్తు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆమె వెల్లడించారు. జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమిస్తామని చెప్పారు. ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని, ఈసారి జాతరకు 150 కోట్లు కేటాయించినట్లు వివరించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.జాతర మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రికి సమర్పించి, ఆమోదం పొందిన తర్వాత పనులను వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారులను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. సమ్మక్క–సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత ప్రతిఫలించేలా ఆలయ ప్రాంగణ రూపకల్పన జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం భక్తులందరికీ సౌకర్యవంతమైన వాతావరణంలో మహా మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు.




