27-10-2024 నాడు నాచారంలోని సీవరేజ్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఆదివారం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇండ్లను కూల్చివేసి, బస్టాండ్‌, మెట్రో స్టేషన్‌ ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. మూసీ పేరిట సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, ఇండ్లను కోల్పోతున్న పేదలకు అండగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం కేటీఆర్ గారు మూసీ కలుషిత నీటిని మరియు శుద్ధి చేసిన నీటిని మీడియా ముఖంగా ప్రజలకు చూపించారు. మూసీ వెంబడి ఇండ్లను కోల్పోతున్నవారికి అండగా నిలుస్తూ వారి తరఫున రాజ్యాంగ, న్యాయపరంగా రక్షణ కల్పిస్తామని, ఇప్పటికే 500 మందికి ఊరటనిచ్చే లా హైకోర్టులో స్టే ఆర్డర్లు వచ్చాయన్నారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్‌, ఎస్టిమేషన్‌ లేనప్పుడు పేదల ఇండ్లను ఎందుకు కూలగొడుతున్నారని ప్రశ్నించారు. ఇండ్లు ఖాళీ చేయాలంటున్న అధికారులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలను ఇబ్బంది పెడితే బీఆర్‌ఎస్‌ సహించబోదని, పేదల ఇండ్లు కూల్చే కుట్రలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

సీం కేసీఆర్‌ హయాంలోనే మూసీ బాగు

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీలు మూసీని మురికి కూపంలా మార్చితే, స్వరాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం మూసీని సుందరీకరణ చేపట్టినట్టు చెప్పారు. ఎస్టీపీలను సక్రమంగా నడిపితే నల్లగొండ జిల్లాకు పరిశుభ్రమైన నీరు వెళ్తుందని తెలిపారు. దక్షిణాసియాలోనే మొదటగా వంద శాతం మురుగునీటిని శుద్ధి చేసిన నగరంగా హైదరాబాద్‌ నిలిచిందని, ఇది కేసీఆర్‌ ఘనతేనని స్పష్టం చేశారు. గతంలోనే రూ. 3800 కోట్ల ఖర్చుతో ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు. నగరంలో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీకి పునరుజ్జీవం తేవాలంటే ముందుగా నీటిని శుద్ధి చేయాలని అప్పటి సీఎం కేసీఆర్‌ సంకల్పించారని గుర్తు చేశారు. గతంలో కాంగ్రెస్‌ మూసీ ద్వారా నల్లగొండకు మురుగు నీరు పంపితే, బీఆర్‌ఎస్‌ హయాంలో శుద్ధజలాలను పంపించే ప్రణాళికలను అమలు చేశామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కట్టిన ఇండ్లకు సున్నం వేసి కట్టిన గుంపు మేస్త్రీని తానేనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నాడని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మూసీని శుద్ధి చేసేందుకు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను మూసీ నదికి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. దీనికి 2023లోనే రూ. 1100 కోట్లతో మూసీ అనుసంధాన పనులు చేపట్టినట్టుగా చెప్పారు. ఇక ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి అనుసంధానంతో మూసీకి పునరుజ్జీవం పోసిందే బీఆర్‌ఎస్‌ అని మరోసారి స్పష్టం చేశారు. మూసీ డెవలప్‌ అథారిటీ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి ఉన్నప్పుడే పనులన్నీ దాదాపు పూర్తి చేశామని తెలిపారు. అన్నింటికీ కలిపినా రూ. 25వేల కోట్లతో మూసీకి పూర్వ వైభవం వస్తుందని స్పష్టం చేశారు. పేదల ఇండ్లను కూల్చి, అవినీతి మూటలు ఢిల్లీకి తరలిస్తామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మా పార్టీ బ్యూటీఫికేషన్‌కు వ్యతిరేకం కాదు.. మీ లూటిఫికేషన్‌కు వ్యతిరేకం అని తెలిపారు. మూసీ బ్యూటీఫికేషన్‌కు బీఆర్‌ఎస్‌ వ్యతిరేకం కాదని, పేదలను రోడ్డుపై పడేసే లూటిఫికేషన్‌కు మాత్రమే తాము వ్యతిరేకమని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బఫర్‌జోన్‌లో అనుమతులతో ఇండ్లు కట్టుకున్నవారిని కబ్జాదారులని సీఎం రేవంత్‌రెడ్డి ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. లక్షల మందిని రోడ్డున పడేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటామంటే బీఆర్‌ఎస్‌ ఎలా మద్దతునిస్తుందని ఆయన ప్రశ్నించారు. మూసీ పేరిట లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని సీఎంను ప్రశ్నించారు. అవసరమైతే రెండు దిక్కుల కరకట్టలు కట్టి, ఎవరికీ నష్టం లేకుండా చేయాలని గానీ, బఫర్‌ జోన్‌ జోలికి వెళ్లకూడదని ప్రభుత్వానికి సూచించారు. పేదల ఇండ్లు కూల్చి, వారిని రోడ్డున పడేసి కట్టే మాల్స్‌ ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ దూకుడును తప్పుబట్టారు. కార్యక్రమ అనంతరం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు 100 కు పైగా ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థులకు ఫీజు మొత్తం అండగా నిలబడుతున్న వైనాన్ని ధైర్యాన్ని కొన్ని ఆడుతూ అదే స్టేజ్ పైన ఆ యొక్క ఎంబిబిఎస్ విద్యార్థులందరికీ చెక్కుల పంపిణీ గౌరవ కేటీఆర్ గారు చేతుల మీదుగా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కేపీ. వివేకానంద, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర రెడ్డి, కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు, నాయకులు సాయిజెన్ శేఖర్, బన్నాల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.