పేదల్లో అతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు..
రాష్ట్రంలోని పేదల్లో అతి పేదలకే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి కానుకగా ఈ మేరకు ప్రకటించింది. అయితే పండుగ రోజు అమావాస్య కాబట్టి, ఆ తర్వాత (ఒకట్రెండు రోజులకు) వాటి నిర్మాణాలకు శ్రీకారం చుడతామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒక దాన్ని దీపావళి కానుకగా ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు కొనసాగిన ఈ భేటీ వివరాలను బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పొంగులేటి మీడియాకు వెల్లడించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కదాన్ని మాత్రమే ఇస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. వారు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 317 జీవో, 46 జీవోలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికను సమర్పించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పౌజ్, హెల్త్, మ్యూచువల్ ప్యాటర్న్స్‌లలో బదిలీలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ధాన్యం సేకరణకు గాను మొత్తం ఆరువేల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగల్ ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూ.20 వేల కోట్ల విలువైన ధాన్యం రైస్ మిల్లుల వద్ద ఉండిపోయిందని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందని తెలిపారు. వాటి ప్రకారం ధాన్యం సేకరణ నుంచి డిఫాల్టర్లను పూర్తిగా తప్పించేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని వివరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణకు చెందిన సినిమా స్టుడియోకు ప్రభుత్వం భూములు కేటాయించిందా? అని పాత్రికేయులు అడగ్గా… అలాంటిదేమీ లేదని పొంగులేటి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రాజకీయ బాంబులు పేలతాయని మీరు తాజాగా చెప్పారు కదా? అవి ఎప్పుడు పేలబోతున్నాయి అని అడగ్గా… ‘దీపావళి టపాసుల కంటే ముందే అవే పేలతాయి…’ అని ఆయన జవాబిచ్చారు..
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17న జీవో 18ని విడుదల చేసిందని గుర్తు చేశారు. దాని ప్రకారం అసెంబ్లీలో చేసిన తీర్మానం మేరకు సామాజిక, ఆర్థిక, కుల సర్వే (గణన)కి సంబంధించిన విధి విధానాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నవంబరు 30లోపు ఆ సర్వేను పూర్తి చేసేందుకు నిర్ణయించామని అన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం జిల్లా కలెకర్లతో సమావేశాలు నిర్వహిస్తామనీ, మండలాధికారులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సర్వేకు సంబంధించి 150 ఇండ్లను ఒక గ్రూపుగా పరిగణిస్తామని తెలిపారు. ఇప్పటికే జిల్లాల్లో అధికారులు 50 ఇండ్ల చొప్పున సర్వే నిర్వహించారని వివరించారు. తద్వారా ఒక్కో ఇంటి సర్వేకు ఎంత సమయం పడుతుందనే విషయాన్ని వారు అంచనా వేశారని తెలిపారు. ఆ ప్రకారంగా 20 రోజుల్లోపు సర్వేను పూర్తి చేయొచ్చనే నిర్దారణకు వారు వచ్చారని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. గత బీఆర్‌ఎస్ సర్కారు ఒక్క రోజులోనే సమగ్ర కుటుంబ సర్వే అంటూ హడావుడి చేసినా, దాని వివరాలను మాత్రం వెల్లడించలేదని విమర్శించారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ మార్గదర్శక త్వంలో కాంగ్రెస్… కులగణనకు కట్టుబడి ముందుకె ళుతోందని చెప్పారు. మన రాష్ట్రంలో చేపట్టబోయే సర్వేను పూర్తిగా పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలందరూ సరైన సమాచారాన్ని సర్వే అధికారులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చాలా కాలంగా కుల గణనకు డిమాండ్ చేస్తున్న సంఘాలు సైతం ప్రభుత్వం చేపట్టబోయే ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించిందని తెలిపారు. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై ఏడాదికి రూ.3 వేల కోట్లు, నెలకు సగటున రూ.230 కోట్ల భారం పడుతుందని పొన్నం ఈ సందర్భంగా విశ్లేషించారు.
అయినా 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒకదాన్ని తక్షణమే ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. ఈ విషయాన్ని ఉద్యోగులందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ప్రతిపక్షాలు దీనిపై రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
ఆచితూచి అడుగులేయాలి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉన్న తరుణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు… కిందిస్థాయిలో ఆచితూచి అడుగులేయాలనే అభిప్రాయం మంత్రివర్గ సమావేశంలో వ్యక్తమైందని సమాచారం. అలాగాకుండా ‘కొత్త రోడ్లేస్తాం, కొత్త పాఠశాలలు, కళాశాలలు కట్టిస్తాం’ అంటూ ఇబ్బడి ముబ్బడిగా హామీలిస్తే ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ మంత్రులు అభిప్రాయపడ్డట్టు వినికిడి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయలేక ఇప్పటికే సతమతమవుతున్న తరుణంలో ప్రజలు, పార్టీ క్యాడర్ మెప్పు కోసం లేనిపోని వాగ్దానాలు చేస్తే మున్ముందు వారికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుందనే అభిప్రాయం మంత్రివర్గ సహచరుల్లో వ్యక్తమైనట్టు తెలిసింది.
మంత్రివర్గ నిర్ణయాలు…
– రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే గిరిజన యూనివర్సిటీ (సమ్మక్క సారలమ్మ వర్సిటీ)కి 211 ఎకరాల భూమిని అప్పగిస్తూ తీర్మానం
– హైదరాబాద్ మెట్రో రైల్ మార్గాల విస్తరణకు గ్రీన్ సిగల్.
నాగోల్ – ఎల్బీనగర్, ఎల్బీనగర్ – హయత్‌నగర్, ఎల్బీనగర్ – శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ.
– నవంబర్ 30లోపు కులగణన పూర్తి చేయాలి..
– ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యంతో పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖల పరిధిలోని రోడ్ల నిర్మాణం..
– ఉస్మానియా ఆస్పత్రికి గోషామహల్‌లో స్థలం కేటాయింపు..
– రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని వాడేందుకు నిర్ణయం..
– వివిధ జిల్లాల్లోని ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొత్త కోర్టులకు సిబ్బంది కేటాయింపు..
Share this article in your network!