బాలనటుడి నుంచి కమెడియన్ గా .. ఆ తరువాత హీరోగా ఎదిగిన అలీ, ఆ తరువాత కమెడియన్ గానే సెట్ అయ్యాడు. వందల సినిమాలతో ప్రేక్షకులను హాయిగా నవ్వించాడు. ఈ మధ్య కాలంలో ఆయన వెండితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. బుల్లితెరపైనే ఎక్కువ సందడి చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు.  

ఈ మధ్య కాలంలో చెప్పుకోదగిన పాత్రలు రావడం లేదు .. అందువల్లనే సినిమాలను తగ్గించుకున్నాను. 'ఎఫ్ 3'లో మాత్రం అనిల్ రావిపూడి నాతో 'పాలబేబీ' అనే వడ్డీ వ్యాపారి పాత్రను చేయించారు. తెరపై నా పాత్ర చాలా సేపు ఉంటుంది .. నాన్ స్టాప్ గా నవ్విస్తుంది. చాలా కాలం తరువాత ఒక మంచి పాత్రను చేసిన ఫీలింగ్ కలిగింది.  

రాఘవేంద్రరావు గారు .. దాసరి గారు .. ఈవీవీ గారితో సినిమాలు చేశాను. వాళ్లందరి లక్షణాలు నాకు అనిల్ రావిపూడిలో కనిపించాయి. కామెడీపై ఆయనకి గల పట్టు చూసి ఆశ్చర్యపోయాను. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నప్పటికీ టెన్షన్ లేకుండా తాను అనుకున్నది చేసుకుంటూ వెళ్లే ఆయన తీరు నాకు నచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.