ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వాగతించారు. నదులపై ప్రాజెక్టుల విషయంలో ముందుకు వెళ్లే ముందు రాష్ట్రాల వాటాలు స్పష్టతతో నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణలో రాజకీయాలపై స్పందించిన నారాయణ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా మాయమైపోయిందని, ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి భావోద్వేగాల రాజకీయాలు లేవని వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వస్తున్న విమర్శలను ఖండించిన నారాయణ,”రేవంత్ రెడ్డి ప్రజలచేత ఎన్నుకోబడిన నేత. ఆయన్ని నామినేట్ చేసి తెచ్చిన వారు కాదు. పొట్టివాడు గట్టివాడిగా ఆయన నిరూపించుకున్నారు. ఆయనపై అన్యాయం చేశారన్న వాదనల్లో నిజం లేదు. నీటి సమస్యను అడ్డుపెట్టుకుని రేవంత్‌ను టార్గెట్ చేయడం సరికాదు” అని స్పష్టం చేశారు.”నీటిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం, తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమే” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
బనకచర్ల ప్రాజెక్టు గురించి తానే తొలిసారి ప్రస్తావించానని నారాయణ పేర్కొన్నారు. అయితే, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ అంశాన్ని అతిగా మాట్లాడారని, ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి అత్యవసరమైనది కాదని, ముందుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.బనకచర్ల ప్రాజెక్టు రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టు కాదని, దాని ఖర్చు రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందని తెలిపారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో, వివాద రహితంగా ప్రాజెక్టులను నిర్మించుకోవాలని, అనవసరంగా వివాదాలను రేపే ప్రయత్నాలు నివారించాలని ఆయన హితవు పలికారు
పొట్టివాడు గట్టివాడని రేవంత్‌ను పొగిడిన నారాయణ




