జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో సంచార చేపల విక్రయ వాహనాల పంపిణీ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కూడా పాల్గొన్నారు. మంత్రులు సంచార చేపల విక్రయ వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు.
ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతలో 31 వాహనాలను పంపిణీ చేసింది. మత్స్యకార మహిళల ఆర్థిక బలోపేతానికి ఉపయోగపడుతున్న ఈ సంచార చేపల విక్రయ వాహనాల ద్వారా అనేక కుటుంబాలు మంచి ఆదాయం పొందుతున్నాయి. మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం ఈ రోజు మరో 36 వాహనాలను పంపిణీ చేసింది. ఈ వాహనాల ద్వారా రోజుకు ఎనిమిది వేల రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తున్నారని మహిళలు తమ అనుభవాలను మంత్రులతో పంచుకున్నారు. కష్టపడి వ్యాపారం చేస్తున్న పలువురు మహిళలకు మంత్రులు సీతక్క, వాకిటి ప్రశంస పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పాన్ని గుర్తుచేశారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు, ఉచిత రవాణా, రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. పెట్రోల్ బంకులు, సోలార్ కంపెనీలు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఆర్టీసీ అద్దె బస్సులు వంటి వ్యాపారాల్లో మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటివరకు 25 వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చామని, ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇల్లు కట్టుకొనే స్థితిలో లేని పేదలకు మహిళా సంఘాల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
మహిళా సంఘ సభ్యుల కోసం త్వరలో యూనిఫాం చీరలు కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు. సేర్ఫ్ ద్వారా మత్స్యకార మహిళలకు నీధం వంటి ప్రముఖ మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాకాలను మహిళలు అంతా అందిపుచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ అద్దె బస్సుల ద్వారా ఒక్కో మహిళా సంఘం ప్రతినెల 70 వేల రూపాయలను సంపాదిస్తున్నట్లు, పెట్రోల్ బంకుల ద్వారా ప్రతినెల 4 నుంచి 5 లక్షల వరకు ఆదాయం మహిళా సంఘాలకు వస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి పట్ల సీతక్క నిబద్ధతతో పని చేస్తున్నారని అభినందించారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉందని, చేపలు తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని వివరించారు. చేపల పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతామని, త్వరలో వందల సంఖ్యలో సంచార చేపల విక్రయ వాహనాలను పంపిణీ చేస్తామని ప్రకటించారు.




