రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పంచాయతీరాజ్ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క ఈ రోజు ENC ఎన్. అశోక్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి రహదారుల పరిస్థితిపై సమీక్షించారు.
అధికారులు అందించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక మరమ్మత్తులకు రూ.22.71 కోట్లు, శాశ్వత మరమ్మత్తులకు రూ.352 కోట్లు, మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణకు రూ.374.71 కోట్లు అవసరమని అంచనా వేశారు.
వరదల ప్రభావంతో 22 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా దెబ్బతినగా, వాటిలో 14 గ్రామాలకు తాత్కాలిక రహదారి మరమ్మత్తులు చేపట్టినట్లు ENC అశోక్ తెలిపారు. మిగిలిన గ్రామాల్లో రాకపోకలు సులభం అయ్యేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
అలాగే వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయాలని, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా రహదారుల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని మంత్రి స్పష్టం చేశారు.




