కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై కేటీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటం సరికాదని అన్నారు.
బేగంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికపై నిర్వహించిన బీజేపీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తోందని అన్నారు. తమ పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. బీజేపీని విమర్శించే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీ కనుసన్నుల్లో నడుస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. మూడు కుటుంబ పార్టీలు కలిసి బీజేపీని ఓడించాలని చూస్తున్నాయని మండిపడ్డారు.
హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని, అంబర్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి కూడా ఈ నగరంలో భాగమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న ప్రాంతాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తేనే నగరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని మోదీ చేస్తున్న కృషి వల్లే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.