ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య జరిగిన భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు తీవ్రంగా స్పందించారు. ఈ సమావేశం వెనుక నిగూఢ అర్థాలున్నాయని, ప్రజల దృష్టిని మోసగించేందుకు ముసుగు ధరించారని ఆయన ఆరోపించారు. “ముసుగు వీడింది, నిజం తేటతెల్లమైంది… 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది” అంటూ కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా విమర్శల వర్షం కురిపించారు.
తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించిన రేవంత్‌కు, నిధులు రాహుల్ గాంధీ ఇచ్చారని, గోదావరి నీళ్లను అప్పగించేందుకు ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేశారు. “తెలంగాణ వ్యతిరేకిని గెలిపించినందుకు నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి… బూడిద మాత్రం తెలంగాణ ప్రజలకే!” అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
‘జై తెలంగాణ’ అనడానికే సిగ్గా?
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చలే జరగలేదని రేవంత్ చెప్పిన మాటలపై శంకాభావం వ్యక్తం చేశారు. “గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పగించేందుకు గద్దెనెక్కారా రేవంత్ రెడ్డి?” అని ప్రశ్నించారు. “జై తెలంగాణ అనడానికే సిగ్గు… నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకు అప్పగించేందుకు మాత్రం దిమ్మతిరిగిపోయే ధైర్యం ఉందా?” అంటూ ప్రశ్నించారు.
“ఇకెందుకు రెండు రాష్ట్రాలు?”
రెవంత్ రెడ్డి పై దూకుడుగా విమర్శలు కొనసాగించిన కేటీఆర్, “ఇకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి సరిహద్దులు చెరిపేయి! అప్పుడు నీ అక్కసు తీరుతుందేమో!” అని ఎద్దేవా చేశారు. తెలంగాణను తాకట్టు పెట్టే ప్రయత్నాలను ప్రజలు సహించరని హెచ్చరించారు.
ఒక్క బొట్టు నీరు కూడా కాదు!
తెలంగాణ జలాలపై ఏ విధమైన రాజీ జరుగినా, తీవ్రంగా ఎదురు తీరతామని హెచ్చరించిన కేటీఆర్, “ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా, మరో ఉద్యమం అట్టహాసంగా మొదలవుతుంది!” అని స్పష్టం చేశారు. “ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం, కానీ ప్రాంతవాడు మోసం చేస్తే ఇక్కడే పాతిపెడతాం!” అంటూ మండిపడ్డారు.
“తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని పడుతుంది!”
తెలంగాణ హక్కులకు గాయం చేస్తే ఊరుకోబోమని, బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి మరో పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు. “తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకుండా పడుతుంది!” అని కేటీఆర్ స్పష్టం చేశారు.




