జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ వర్గాల్లో చురుగ్గా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ శక్తిని మరోసారి నిరూపించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నా, అందరూ కలిసికట్టుగా కష్టపడితే బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది” అని తెలిపారు.
మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆమె గెలుపు గోపినాథ్‌కు నిజమైన నివాళిగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన కేటీఆర్, “ఓటుకు డబ్బులు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కానీ వారు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు” అని విమర్శించారు.
ముఖ్యమంత్రి కుటుంబంపై విమర్శలు చేస్తూ, “సీఎం సోదరుడు చెరువులో ఇళ్లు కట్టినా పట్టించుకోవడం లేదు. కానీ పేదల బస్తీల్లో ఇళ్లు కూలగొడుతున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగ ఓట్లు తొలగించి, కొత్తగా పేరు చేర్చుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే, “పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తున్నారా?” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వలేదని, ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుకావాలని ఆకాంక్షించిన కేటీఆర్, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఎన్నికలో పార్టీ శక్తిని నిరూపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మాగంటి సునీత మాట్లాడుతూ, “గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసి పనిచేయాలి. కార్యకర్తల అండతోనే విజయం సాధిస్తాం” అని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా మాట్లాడుతూ, పార్టీ కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని అన్నారు.




