తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా స్పందించారు. రైల్వే, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో బుధవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఉన్నత ప్రమాణాల పరిశోధన కేంద్రాలు, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం ఉన్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ రంగంలో ప్రతిపాదించిన కీలక ప్రాజెక్టులకు తక్షణ ఆమోదం తెలపాలని కేంద్రాన్ని కోరారు.
EMC 2.0 కింద ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ పార్క్
రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో హైటెక్ ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాన్ని ఈ సందర్భంగా సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. రిజినల్ రింగ్ రోడ్ సమీపంలో మరొక ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుపై కూడా కేంద్ర మద్దతు కోరారు.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ప్రాజెక్టులకు ఆమోదం కోరిన సీఎం
తెలంగాణను సెమీకండక్టర్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ (ASIP) ప్రాజెక్ట్, మైక్రో LED డిస్‌ప్లే ఫ్యాబ్ ప్రాజెక్ట్ (క్రిస్టల్ మ్యాట్రిక్స్)లకు కేంద్రం తక్షణ ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి సానుకూల స్పందన
సీఎం వివరాలను పరిశీలించిన మంత్రి అశ్విని వైష్ణవ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టెక్నాలజీ అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని ప్రశంసించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలపై కేంద్రం త్వరితగతిన స్పందించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగిస్తూ, కీలక ప్రాజెక్టులకు బీజం వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చర్యలు రాజకీయంగా, పారిశ్రామికంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.




