పంచాయతీరాజ్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ కొత్త నాటకం మొదలుపెట్టిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయి సమావేశం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… “19 నెలలుగా పైసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ₹6000 మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఇది రైతుల మనోభావాలను దెబ్బతీసే చర్య. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతులకు మభ్యపెట్టే ప్రయత్నమే జరుగుతోంది” అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు వంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. యూరియా లభ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. “ప్రధాని మోదీ హయాంలో తెలంగాణలో అవసరానికి మించి యూరియా సరఫరా జరుగుతోంది. అయినా దాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కొరత ఉందని అసత్య ప్రచారం చేస్తోంది” అని ఎన్. రాంచందర్ రావు అన్నారు.




