Friday, March 6, 2026
spot_imgspot_img

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి కొత్త దిక్సూచి: సీఎం చంద్రబాబు 

Must read

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో కీలక అడుగు వేశారు. దేశప్రముఖ పారిశ్రామిక వేత్తలతో కూడిన టాస్క్ ఫోర్సు రూపొందించిన ఏపీ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదికను ఆయన ఆవిష్కరించారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసింది. మొత్తం 17 కీలక రంగాలకు సంబంధించిన 120 సిఫార్సులతో ఈ నివేదిక రూపొందించబడినట్టు వెల్లడించారు.

ఈ కార్యక్రమం ఢిల్లీలోని సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సదస్సు సందర్భంగా జరిగింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ సాకారం అయ్యేందుకు ఇది కీలక పథకంగా నిలవనుందని సీఎం పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని అందించడంలో ప్రభుత్వం ముందుందని, వచ్చే ప్రతి పెట్టుబడి ప్రాజెక్టునూ రాష్ట్ర ప్రాజెక్టుగా స్వీకరించి పూర్తి మద్దతునిచ్చే విధానాన్ని అవలంబిస్తున్నామని వివరించారు.

పెట్టుబడులకు ప్రత్యేక ఎస్కార్టు సర్వీసు:

పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ఏపీలో ప్రత్యేకంగా ఎస్కార్టు సర్వీసులను ఏర్పాటు చేశామని, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో అనుమతులు వేగంగా మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. మూడు ఆర్థిక కారిడార్లను కేంద్రంగా తీసుకొని రంగాల వారీగా పరిశ్రమల అభివృద్ధికి నూతన విధానాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.

అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి:

సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. బెస్ట్ లివబుల్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. జాతి నిర్మాణం, సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకమని అన్నారు. నైపుణ్యవంతమైన మానవ వనరులు, సర్క్యులర్ ఎకానమీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఏపీని అభివృద్ధి పరచాలన్న దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు.

రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం:

రాష్ట్రంలో కనీసం రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా విధానాలు రూపొందిస్తున్నట్టు సీఎం తెలిపారు. ప్రతి రంగంలో అత్యుత్తమ విధానాలను అమలుచేస్తూ, రియల్ టైమ్ డేటా ఆధారంగా పాలన కొనసాగిస్తున్నామని వివరించారు.

చంద్రబాబు విజనరీ నేత: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్

ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, “ఏపీ అభివృద్ధికి బలమైన ప్రణాళికను రూపొందించిన సీఎం చంద్రబాబు నిజమైన విజనరీ నాయకుడు” అని ప్రశంసించారు. ఏపీలో పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. టీసీఎస్ కూడా అమరావతిలోని క్వాంటం వ్యాలీ ప్రాజెక్టులో భాగస్వామిగా వ్యవహరించనున్నదని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుండటానికి చంద్రబాబుకు ఉన్న గుడ్ విల్ కూడా ఓ ప్రధాన కారణమని పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!