Thursday, September 3, 2026

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!

Must read

Hyderabad Indiramma Houses Beneficiary Verification Final List

Indiramma Houses : హైదరాబాద్‌ నగరవాసులకు తెలంగాణ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఇప్పుడు అత్యంత కీలకమైన తుది ఘట్టానికి చేరుకుంది. దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతి ద్వారా ప్రాథమికంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో నేరుగా వెళ్లి సమగ్రంగా తనిఖీ చేసేందుకు గృహనిర్మాణ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నగర పరిధిలోని మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం నుంచే ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది.

నాలుగు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి

ఈ కీలకమైన పరిశీలన ప్రక్రియను రాబోయే నాలుగు రోజుల్లోనే వేగంగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో రోజుకు సగటున 150 లబ్ధిదారుల ఇళ్లను అధికారులు స్వయంగా సందర్శించనున్నారు. ఇందుకోసం హౌసింగ్ బోర్డు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించడమే కాకుండా, తనిఖీలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు ముందస్తు శిక్షణ కూడా పూర్తి చేసింది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి 480 మంది చొప్పున లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రాథమికంగా ఎంపిక చేశారు.

వెయిటింగ్ లిస్ట్‌లోని వారికి దక్కనున్న అవకాశం

క్షేత్రస్థాయి తనిఖీల్లో దరఖాస్తుదారులు ఇచ్చన వివరాలు తప్పుగా ఉన్నా లేదా ఏవరైనా అనర్హులుగా తేలినా వారిని జాబితా నుంచి తక్షణమే తొలగిస్తారు. అలా ఖాళీ అయిన స్థానాల్లో ఇప్పటికే సిద్ధం చేసిన వెయిటింగ్ లిస్ట్ నుంచి తర్వాతి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. నియోజకవర్గాన్ని బట్టి 120 నుంచి 300 వరకు వెయిటింగ్ లిస్ట్ దరఖాస్తుదారులు అందుబాటులో ఉన్నారు. ఈ నాలుగు రోజుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అర్హులైన వారి తుది జాబితాను ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుంది.

అధికారులు పరిశీలించే అంశాలు , వివరాల నమోదు

లబ్ధిదారులు గత 10 ఏళ్లుగా అదే నియోజకవర్గ పరిధిలోనే స్థానికంగా నివసిస్తున్నారా లేదా అనే అంశాన్ని అధికారులు ప్రధానంగా తనిఖీ చేస్తారు. దీనితో పాటు దరఖాస్తులో సమర్పించిన వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం నిజమైనవా కాదా అనే వివరాలను అక్కడికక్కడే నిర్ధారించుకుంటారు. పరిశీలనలో అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలితే, వెంటనే ప్రత్యేక యాప్‌లో ఆ సమాచారాన్ని నమోదు చేసి, సదరు లబ్ధిదారుని నివాసాన్ని అక్కడికక్కడే జియో ట్యాగింగ్ చేస్తారు.

పోర్టల్‌లో వివరాలు , అభ్యంతరాల నమోదు

ఆగస్టు 28 నుంచి 31 వరకు నిర్వహించిన లాటరీ విజేతల వివరాలను హౌసింగ్ బోర్డు తమ అధికారిక వెబ్‌సైట్ [https://tghb.telangana.gov.in/allotmentobjection](https://tghb.telangana.gov.in/allotmentobjection) లో అందుబాటులో ఉంచింది. దరఖాస్తుదారులు తమ పేరు, అప్లికేషన్ నంబర్ లేదా ఆధార్ కార్డు వివరాలను నమోదు చేసి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ ఎంపిక ప్రక్రియపై లేదా లబ్ధిదారుల వివరాలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే దరఖాస్తుదారులు అదే పోర్టల్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే సదుపాయాన్ని కూడా కల్పించారు.

 

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!