Supreme Court: దేశ రాజధాని ఢిల్లీలో నిరసనకారుల ఆందోళనల వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీకి చెందిన వ్యాపార సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం స్పందించింది. పండుగల సీజన్‌లో కన్నాట్ ప్లేస్ (CP) పరిసర ప్రాంతాల్లో జరిగిన సుదీర్ఘ ఆందోళనల కారణంగా సుమారు 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వ్యాపారులు న్యాయస్థానం( Supreme Court) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
నిరసనకారులను ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశం.. ఆందోళన నిర్వహకులపై సీరియస్:
పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ, నిరసనలు చేపడుతున్న వారిని, ఆందోళన నిర్వాహకులను ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని వ్యాపార సంఘాలను ఆదేశించింది. నిరసనకారులను పార్టీగా చేర్చకుండా వారిపై ఎలాంటి ఏకపక్ష ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, అయితే ఆందోళనకారుల వాదనను కూడా వినడం చట్టపరంగా అవసరమని బెంచ్ పేర్కొంది.
‘ఒక్కరే నిరవధికంగా ఆక్రమించలేరు’.. ప్రాథమిక హక్కులపై ధర్మాసనం సంచలన స్పష్టీకరణ:
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక హక్కుల పేరుతో నిరసన ప్రాంతాలను ఏ ఒక్కరూ నిరవధికంగా ఆక్రమించి ఉంచలేరని ధర్మాసనం స్పష్టం చేసింది. సమాజంలో రైతులు, కార్మికులు, వ్యాపారులు సహా ఇతరులకు కూడా తమ సమస్యలపై గళమెత్తే హక్కు ఉంటుందని గుర్తించాలని గుర్తుచేసింది. ఇదే సమయంలో మాస్ డిటెన్షన్లు, పోలీసు బలప్రయోగాలు, మెట్రో స్టేషన్లు, ఇంటర్నెట్ సేవల నిలిపివేతపై దాఖలైన ఇతర పిటిషన్లను కూడా విచారించింది.



