Mitchell Santner : ఆకాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడాడు. టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమ కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ ఈ ఇద్దరు అనుభవజ్ఞులైన బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత ఐదేళ్లుగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్నాడని పేర్కొన్నాడు.
భారత జట్టులో అనుభవజ్ఞులైన బ్యాటర్లు ఉండటంతో వన్డే సిరీస్‌లో తమకు గట్టి సవాల్ ఎదురుకానుందని సాంట్నర్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎదుర్కొనేందుకు తమ బౌలింగ్ విభాగం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుందని వెల్లడించాడు.
న్యూజిలాండ్ పిచ్‌లపై పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేయడం కీలకమన్నాడు. పిచ్‌లు బౌలర్లకు అనుకూలించినప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భారత బ్యాటర్లపై ఒత్తిడి కొనసాగించడం చాలా ముఖ్యమన్నాడు. ఇక రోహిత్, కోహ్లీల రాకతో స్టేడియాలకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తారని ఆశిస్తున్నట్లు చెప్పాడు. టీ20 సిరీస్‌లో ఇప్పటికే మంచి ప్రేక్షకాదరణ లభించిందని, వన్డేల్లోనూ అదే ఉత్సాహం కొనసాగుతుందన్నాడు.
టీ20 సిరీస్‌కు మంచి ప్రేక్షకాదరణ లభించింది. రోహిత్, విరాట్ ఇక్కడ ఉండటంతో వన్డేలకు కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని భావిస్తున్నాం. వారిద్దరూ ఎంత గొప్ప ఆటగాళ్లో మాకు తెలుసు. కెరీర్ చివరి దశలో ఉన్నప్పటికీ అద్భుతంగా ఆడుతున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లోనూ వారి ఆటతీరు చూశాం. అని సాంట్నర్ తెలిపాడు.
ఇక రోహిత్ శర్మ ఆటను ఐపీఎల్లో చాలా దగ్గర నుంచి గమనించాను. భారత బ్యాటింగ్ లైనప్‌ను ఎలా ఎదుర్కోవాలనే విషయంపై మా బౌలింగ్ విభాగం ఇప్పటికే చర్చించింది. న్యూజిలాండ్ పరిస్థితులకు తగ్గట్టుగా బౌలింగ్ చేయడం ముఖ్యం. పిచ్‌లు బౌలర్లకు సహకరించినప్పుడు ఎలా వ్యవహరించాలన్నదే అసలైన సవాల్ అని పేర్కొన్నాడు.
గత ఐదేళ్లుగా శుభ్‌మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతడితో పాటు భారత టాప్ ఆర్డర్‌ను త్వరగా కట్టడి చేయగలిగితే మేం మంచి స్థితిలోకి వస్తాం. వన్డే క్రికెట్లో నిలకడగా మంచి బంతులు వేయడం, ఎక్కువసేపు ఒత్తిడి కొనసాగించడం చాలా ముఖ్యం. పిచ్ బౌలర్లకు సహకరిస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలి అని సాంట్నర్ అన్నాడు.



