Telangana Government: తెలంగాణ రాష్ట్రంలో చేయూత సామాజిక భద్రతా పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం(Telangana Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం వృద్ధాప్య పింఛనుదారుడు మరణిస్తేనే ఆయన భార్యకు తక్షణమే పింఛన్ మంజూరు చేసే వెసులుబాటు ఉండగా, ఇకపై దీనిని అన్ని కేటగిరీలకు వర్తింపజేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, డయాలసిస్, ఏఆర్టీ, ఫైలేరియా బాధితులు మరణించినా వారి భార్యలకు వెంటనే పింఛన్ అందిస్తారు.
వయస్సు ఆధారంగా పింఛన్ వర్గీకరణ.. దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు:
నూతన నిబంధనల ప్రకారం భర్త మరణించిన మహిళ వయసు 57 ఏళ్లలోపు ఉంటే వితంతు పింఛన్, 57 ఏళ్లు పైబడి ఉంటే వృద్ధాప్య పింఛన్‌గా మంజూరు చేస్తారు. దీనికోసం బాధితులు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో బిల్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, భర్త ఆధార్ కార్డు, మరణ ధృవీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) తప్పనిసరిగా జత చేసి అందించాలి.
15 రోజుల్లో పరిశీలన పూర్తి.. ఆ మరుసటి నెల నుంచే అకౌంట్లో నగదు:
దరఖాస్తు అందజేసిన 15 రోజుల్లోగా అధికారులు పత్రాలను పరిశీలించి చేయూత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల పరిశీలన అనంతరం కలెక్టర్ ఆమోదం పొందిన మరుసటి నెల నుంచే లబ్ధిదారులకు ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్ సొమ్ము అందుతుంది. భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి నిరంతరాయంగా అందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ప్రక్రియను నిరంతర నిబంధనగా అందుబాటులోకి తెచ్చింది.



