- హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
- మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన.. ఉరుములు, మెరుపులు
- నగరాన్ని ముంచెత్తిన వర్షం.. గచ్చిబౌలిలో భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad Heavy Rain : మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరైన హైదరాబాద్ నగరాన్ని సాయంత్రం వరుణుడు పలకరించాడు. అక్టోబర్ 30 (శుక్రవారం) సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అప్పటివరకు వేడితో ఇబ్బందిపడిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది.
ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల్లో వర్షం పడటంతో జనజీవనం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా మేడిపల్లి నుంచి (Hyderabad Heavy Rain) చెంగిచర్ల వరకు వాన తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఘట్‌కేసర్, పోచారం పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. ఈసీఐఎల్, కుషాయిగూడ, నేరేడ్మెట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి.
మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలిలో వర్షం జోరందుకుంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, మధురానగర్ ప్రాంతాల్లోనూ వాన ప్రభావం కనిపించింది. ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే సమయంలోనే వర్షం పడటంతో పలు రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.
Read Also :
గచ్చిబౌలి సహా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, సంతోష్‌నగర్, కంచన్‌బాగ్, బండ్లగూడ, ఛత్రినాక, శాలిబండ ప్రాంతాల్లోనూ వర్షం నమోదైంది. రాజేంద్రనగర్, శంషాబాద్ పరిసరాలు కూడా తడిసిముద్దయ్యాయి.
ఇప్పటికే నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఆర్నబ్ తుఫాను ప్రభావం తగ్గినప్పటికీ వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో వర్షాలు మొదలయ్యాయి. మొత్తానికి ఒక్క సాయంత్రంలోనే హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయి. వేడి నుంచి ఉపశమనం దొరికినప్పటికీ, వాహనదారులు మాత్రం నీటితో నిండిన రహదారులు, ట్రాఫిక్ ఇబ్బందులతో అప్రమత్తంగా ఉండాలి..



