చింతమనేని కుమార్తెకు చైర్మన్ పీఠం లైన్ క్లియర్..?

Must read

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తెరవెనుక సాగుతున్న హై-ప్రొఫైల్ పొలిటికల్ వార్ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కామవరపుకోట జెడ్పీటీసీ స్థానంలో చోటుచేసుకున్న తీవ్ర నాటకీయ పరిణామాల తర్వాత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబం ఈ రేసు నుంచి దాదాపు తప్పుకోవడంతో.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని సాయి నవ్యకు జెడ్పీ చైర్మన్ పీఠం దక్కేందుకు మార్గం పూర్తిగా సుగమమైందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

నిజానికి, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన మాగంటి కుటుంబం గట్టి ఆశలే పెట్టుకుంది. కామవరపుకోట జెడ్పీటీసీ స్థానం నుంచి మాగంటి బాబు భార్యను బరిలోకి దించి, ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని వారు వ్యూహం రచించారు. అయితే, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ తన కుమార్తె మందలపు జాహ్నవికి చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి బీ-ఫామ్ ఇప్పించుకోవడంతో మాగంటి కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన మాగంటి ఫ్యామిలీ రేసు నుంచి తప్పుకోవడమే కాకుండా, వైసీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు వార్తలు వస్తుండటంతో కూటమిలో జెడ్పీ చైర్మన్ రేసు ఒక్కసారిగా ఏకపక్షంగా మారిపోయింది.

మరోవైపు, దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడు జెడ్పీటీసీ అభ్యర్థినిగా బరిలో ఉన్న చింతమనేని ప్రభాకర్ కుమార్తె చింతమనేని నవ్యకు ఇప్పుడు తిరుగులేని లీడ్ లభించింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ల కాలంలో చింతమనేని ప్రభాకర్ కుటుంబం ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, క్యాడర్‌ను కాపాడుకోవడంలో వారు చూపిన చొరవను పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధిష్టానం.. వారి కుటుంబానికి జెడ్పీ చైర్మన్ పీఠం ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మాగంటి వంటి బలమైన ప్రత్యర్థి రేసు నుంచి వైదొలగడంతో, కూటమి తరఫున నవ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం ఇక కేవలం లాంఛనమేనని పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.

The post appeared first on .

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!