మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్‌పై సర్కారు పునరాలోచన..

Must read

హైదరాబాద్: నగర ప్రజా రవాణాలో కీలక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మెట్రో–ఆర్టీసీ కామన్ పాస్ విధానంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించే అవకాశం కల్పిస్తూ అక్టోబర్ తొలి వారంలో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే పాస్ ధరలు ప్రయాణికుల అంచనాలకు మించి ఉండటంతో ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ప్రతిపాదించిన విధానం ప్రకారం రోజువారీ కామన్ పాస్ ధర రూ.400గా, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయించారు. నెలవారీ పాస్‌లో మెట్రో వాటా రూ.7,000 కాగా, ఆర్టీసీ వాటా రూ.1,500గా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ధరలు సాధారణ ప్రయాణికులకు భారంగా మారుతున్నాయని పలువురు ఉద్యోగులు, ఐటీ రంగానికి చెందిన ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

రూ.8,500పై ప్రయాణికుల లెక్కలు

నెలవారీ పాస్ ధరను పరిశీలిస్తే.. మెట్రోలో రోజువారీ గరిష్ఠ ప్రయాణ ఖర్చును లెక్కించుకున్నా నెల మొత్తం వ్యయం కామన్ పాస్ కంటే తక్కువగా ఉండొచ్చని ప్రయాణికులు చెబుతున్నారు. అదే సమయంలో ఆర్టీసీ సాధారణ నెలవారీ పాస్ ధరతో పోల్చినప్పుడు కూడా కామన్ పాస్‌లో అదనపు భారం పడుతోందని వారు పేర్కొంటున్నారు.మెట్రో, ఆర్టీసీ రెండింటినీ ప్రతిరోజూ వినియోగించే ప్రయాణికులకు మాత్రమే కామన్ పాస్ కొంత ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం నిర్ణయించిన ధరలో నిజమైన ప్రయోజనం ఎంతమేర ఉంటుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కార్యాలయాలకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే ఉద్యోగులు నెలవారీ ఖర్చులను లెక్కించుకుంటూ పాస్ ధరను తగ్గించాలని కోరుతున్నారు.

రూ.5 వేల నుంచి రూ.6 వేల మధ్యకు తగ్గించాలన్న డిమాండ్

కామన్ పాస్ ధరను రూ.5,000 నుంచి రూ.6,000 మధ్యకు తీసుకురావాలని ప్రయాణికుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. మెట్రో, ఆర్టీసీ రెండింటినీ వినియోగించే మధ్యతరగతి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర రోజువారీ ప్రయాణికులకు అందుబాటులో ఉండే ధరను నిర్ణయిస్తే ఈ పాస్‌కు మరింత ఆదరణ లభించే అవకాశం ఉందని వారు అంటున్నారు.

విద్యార్థులు, సీనియర్ సిటిజన్లపై చర్చ

మరోవైపు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కామన్ పాస్‌లో ప్రత్యేక రాయితీలు కల్పించాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. సాధారణంగా ప్రజా రవాణాలో కొన్ని వర్గాలకు అందుబాటులో ఉండే రాయితీలను కామన్ పాస్ విధానంలోనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కామన్ పాస్ విధానం ప్రారంభ దశలో ఉండటంతో ప్రయాణికుల స్పందన, వినియోగ విధానం, ఆదాయం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాస్ ధరలు, రాయితీలు, ఇతర నిబంధనల్లో మార్పులు చేసే అంశంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.మెట్రో–ఆర్టీసీ సమన్వయంతో ఒకే పాస్ ద్వారా నగరమంతా ప్రయాణించే సౌకర్యం కల్పించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ.. ధర ప్రయాణికులకు అందుబాటులో ఉంటేనే కామన్ పాస్‌కు విస్తృత ఆదరణ లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయంపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!