తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లేందుకు జనపనార (జూట్) బ్యాగులను అందుబాటులోకి తెచ్చింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు జనపనార రైతులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ బ్యాగులను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి.పరిమాణాన్ని బట్టి జూట్ బ్యాగుల ధరలను రూ.10, రూ.20, రూ.50, రూ.80, రూ.100గా నిర్ణయించారు. శ్రీవారి ఆలయం వెనుక ఉన్న లడ్డూ విక్రయ కేంద్రంలోని జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) కౌంటర్‌లో ఈ బ్యాగులను భక్తులు కొనుగోలు చేయవచ్చు. లడ్డూ ప్రసాదాలను సురక్షితంగా తీసుకెళ్లడంతో పాటు తిరిగి వినియోగించుకునే అవకాశం ఉండటం జూట్ బ్యాగుల ప్రత్యేకతగా అధికారులు చెబుతున్నారు.జూట్ బ్యాగులతో పాటు బయోడీగ్రేడబుల్ సంచులు కూడా తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమంగా తగ్గించేందుకు టీటీడీ చేపడుతున్న చర్యల్లో భాగంగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
తులసి విత్తనాలతో ఎకో ఫ్రెండ్లీ కవర్లు
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా టీటీడీ ఇప్పటికే తులసి విత్తనాలతో కూడిన ఎకో ఫ్రెండ్లీ కవర్లను కూడా ప్రవేశపెట్టింది. ఈ కవర్లను ఉపయోగించిన తర్వాత మట్టిలో పెట్టి నీరు పోస్తే.. కవర్ క్రమంగా కరిగిపోతుంది. అందులోని తులసి విత్తనాల ద్వారా మొక్కలు మొలిచేలా వీటిని రూపొందించారు.ప్రస్తుతం ఈ ఎకో ఫ్రెండ్లీ కవర్లు తిరుమలలోని లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా జూట్ బ్యాగులను కూడా అందుబాటులోకి తీసుకురావడంతో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగా టీటీడీ మరో అడుగు వేసినట్లయింది.
నవరాత్రి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
మరోవైపు తిరుమలలో జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్, వివిధ విభాగాల చెక్‌లిస్ట్‌లను పరిశీలించి లోపాలను గుర్తించి సరిదిద్దాలని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి తక్కువ సమయం మాత్రమే ఉండటంతో అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల రద్దీ, వాహనాల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ, భద్రత, పారిశుధ్యం, తాగునీరు, వైద్య సేవలు తదితర అంశాలపై ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఉత్సవాలను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని అధికారులు పేర్కొన్నారు.


