తిరుమలలోని ఎస్వీ గోశాలలో వందకు పైగా ఆవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. భూమన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఈ క్రమంలో తిరుమల గోశాలను సీపీఐ నారాయణ పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితి, దాణాపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీటీడీ గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని సీపీఐ నారాయణ అన్నారు. ప్రతినిత్యం గోవులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గోవులకు కావాల్సినంత దాణా ఉందని… ఆవులన్నీ పుష్టిగా ఉన్నాయని తెలిపారు. గోశాలను వైసీపీ రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. టీటీడీ గౌరవం తగ్గేలా మాట్లాడవద్దని సూచించారు.
గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని… ఆయనను సస్పెండ్ చేయడం కాదు, విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో గోవులకు పురుగుల దాణా పెట్టారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి హరినాథరెడ్డి కమీషన్లు తీసుకునేవారని ఆరోపించారు.