ఆధార్ ఇప్పుడు బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, ఇతర అనేక సేవల్లో కీలక గుర్తింపుగా మారింది. ఆధార్‌తో మొబైల్ నంబర్ అనుసంధానం ఉండటం వల్ల OTP ఆధారిత సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. అయితే ఆధార్‌లో నమోదైన మొబైల్ నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పటివరకు చాలామంది ఆధార్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది.
ఈ నేపథ్యంలో UIDAI కొత్త అధికారిక Aadhaar App ద్వారా పలు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్ నంబర్ అప్‌డేట్, అడ్రస్ అప్‌డేట్, బయోమెట్రిక్ లాక్/అన్‌లాక్, ఆధార్ ఆథెంటికేషన్ హిస్టరీ, ఈ-ఆధార్ డౌన్‌లోడ్, రిక్వెస్ట్ ట్రాకింగ్ వంటి సేవలు యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు UIDAI అధికారికంగా వెల్లడించింది.
ముందుగా యాప్‌లో రిజిస్ట్రేషన్
Aadhaar Appను Android, iOS ఫోన్లలో అధికారిక Play Store లేదా App Store నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ముందుగా భాషను ఎంచుకుని ఆధార్ నంబర్ నమోదు చేయాలి. అనంతరం నిబంధనలు, గోప్యతా విధానానికి అంగీకరించి, SIM కార్డును ఎంచుకోవాలి. ఆ తర్వాత Face Authentication పూర్తి చేసి యాప్‌లో రిజిస్టర్ కావాలి. చివరగా ఆరు అంకెల PIN సెట్ చేసుకోవడంతో యాప్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?
యాప్‌లో రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత Services విభాగంలో Mobile Number Update ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆధార్‌కు కొత్తగా అనుసంధానించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేసి OTP ద్వారా ధ్రువీకరించాలి. అనంతరం Face Authentication పూర్తి చేసి, UIDAI నిర్ణయించిన రుసుమును చెల్లించాలి.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. ఆధార్‌లో ఇప్పటికే నమోదైన మొబైల్ నంబర్ అందుబాటులో లేకపోతే పరిస్థితి వేరుగా ఉంటుంది. UIDAI ప్రకారం, యాప్‌లో వేరే మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ అయినప్పుడు పాత ఆధార్-రిజిస్టర్డ్ నంబర్, కొత్త నంబర్ రెండింటినీ OTP ద్వారా ధ్రువీకరించాల్సి ఉంటుంది.
పాత నంబర్ పనిచేయకపోతే?
పాత మొబైల్ నంబర్ పూర్తిగా అందుబాటులో లేకపోయినా లేదా ఆధార్‌కు ఇంతకుముందు మొబైల్ నంబర్ అసలు నమోదు చేయకపోయినా Aadhaar App ద్వారా కొత్త నంబర్‌ను మొదటిసారి నమోదు చేయడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో సమీపంలోని Aadhaar Seva Kendra లేదా అధీకృత Aadhaar Enrolment and Update Centreకు వెళ్లాల్సి ఉంటుంది.
అంటే పాత నంబర్ అందుబాటులో ఉన్నవారికి యాప్ ద్వారా ప్రక్రియ మరింత సులభమవుతుంది. కానీ పాత నంబర్ పూర్తిగా పోయిన వారికి మాత్రం కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి.
మొబైల్ అప్‌డేట్‌కు ఎంత ఫీజు?
UIDAI తాజా ఫీజు వివరాల ప్రకారం మొబైల్ నంబర్ వంటి demographic detailsను ప్రత్యేకంగా అప్‌డేట్ చేస్తే రూ.50 రుసుము వర్తిస్తుంది. ఒకే సమయంలో biometric updateతో demographic update చేస్తే ప్రత్యేక demographic update ఛార్జీ వర్తించదు; biometric updateకు వర్తించే రుసుమే ఉంటుంది.


