Harish Rao: తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29 కీలక మలుపు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. నాడు సిద్దిపేట అంబేడ్కర్ భవన్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, దీక్షా దివస్ సందర్భంగా రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయ సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కేదా అని ప్రశ్నించారు. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 ఉండేదా అంటూ నిలదీస్తూ, కేసీఆర్ దీక్షతోనే కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని, ఆ తర్వాత 14 రోజుల్లోనే ఆంధ్రాలో కృత్రిమ ఉద్యమంతో కేంద్రం వెనక్కి తగ్గినా, కేసీఆర్ పోరాటంతోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనపై నిప్పులు.. నాగార్జునసాగర్ అంశంపై ఆందోళన:
ప్రస్తుత ప్రభుత్వ పాలన తీరుపై హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ పాలనలో రాష్ట్రం ఆగమైందని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించిన ఆయన, పరిపాలన చేతకాక రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు. సీఎంకు రైతులంటే పట్టదని, ప్రజలంటే లెక్కలేదని దుయ్యబడుతూ, నాగార్జునసాగర్ ఆంధ్రా వశమైపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్దిపేట సభ ఖర్చులపై ఎద్దేవా.. రామరాజ్యం కోసం పిలుపు:
రాష్ట్రంలో పరిపాలన నిలిచిపోయిందని పేర్కొన్న హరీశ్ రావు, ఈ పాలన అంతం కావాలని, మళ్లీ రామరాజ్యం తీసుకురావడానికి అందరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట సభకు స్థానిక ప్రజలు రారని తెలిసి 26 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో జనాలను తరలించేందుకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని విమర్శిస్తూ, సిద్దిపేటకు ఇచ్చిందేమీ లేదని ఎద్దేవా చేశారు.




