- భూమి పొరల్లో బంగారు నిధి..
- ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్న ఆవిష్కరణ
- చైనాకు దొరికిన రూ.లక్షల కోట్ల సంపద
Massive Gold Discovery : భూమి లోపల ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో మరోసారి నిరూపితమైంది. చైనాలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
రెండు ప్రాంతాల్లో కలిపి దాదాపు 2,000 టన్నులకు పైగా బంగారం ఉండొచ్చన్న అంచనాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ బంగారం మొత్తం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దాదాపు 300 బిలియన్ డాలర్లకు చేరొచ్చని అంచనా.. అంటే దాదాపు రూ. 27,89 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు..
చైనాకు దొరికిన బంగారు నిధి :
చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లో ఉన్న దాడోంగౌ ప్రాంతంలో బయటపడిన నిక్షేపం ఈ ఆవిష్కరణల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ సుమారు 1,444 టన్నుల బంగారం ఉన్నట్లు చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ 2025 నవంబర్‌లో ప్రకటించింది. 1949 తర్వాత చైనాలో గుర్తించిన అతిపెద్ద ఒకే ఒక్క బంగారు నిక్షేపంగా ఇది రికార్డుకెక్కింది.
ఈ నిక్షేపంలో ఉన్న బంగారం విలువను లెక్కిస్తే.. సుమారు 165 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. అయితే, ఇది మొత్తం బంగారాన్ని మార్కెట్ ధరకు లెక్కించిన విలువ మాత్రమే.. తవ్వకాలు, శుద్ధి, రవాణా ఖర్చులు తీసేస్తే వాస్తవంగా వచ్చే ఆదాయం వేరుగా ఉంటుంది..
మరో ప్రాంతంలోనూ భారీ నిక్షేపం :
హునాన్ ప్రావిన్స్‌లోని వాంగు ప్రాంతంలో కూడా మరో భారీ బంగారు నిక్షేపం బయటపడింది. ఇక్కడ వెయ్యి టన్నులకు పైగా బంగారం ఉండొచ్చని ప్రాథమిక అంచనా.. అయితే, ఈ పరిమాణాన్ని పూర్తిగా నిర్ధారించడానికి మరిన్ని తవ్వకాలు, పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. 2024లో ఈ బంగారు నిక్షేపం గురించి ప్రకటించినప్పుడు దీని విలువ 83 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
భవిష్యత్తులో మరిన్ని నిధులు దొరికేనా? :
దాడోంగౌ నిక్షేపం ప్రత్యేకత ఏంటంటే.. అక్కడ బంగారం సాధారణంగా కనిపించే నిలువు రాతి పొరల్లో కాకుండా, తక్కువ వాలుతో ఉన్న రాతి పొరల్లో విస్తరించి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన పరిశోధకులు, ఇలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ బంగారం కోసం అన్వేషణ జరపాలని సూచిస్తున్నారు..
ఈ ఆవిష్కరణ కేవలం చైనాకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా బంగారు గనుల అన్వేషణకు కొత్త దారులు చూపనుంది. భూమి పొరల్లో ఇంకా ఎన్ని విలువైన నిధులు దాగి ఉన్నాయో అన్న ఆసక్తిని పెంచుతోంది..




