- నెలకు ఎన్ని సార్లు ఫ్రీగా డబ్బులు తీసుకోవచ్చు
- ఏటీఎం, పీఓఎస్‌లో క్యాష్ విత్‌డ్రా..
- ఛార్జీలు, పరిమితులపై పూర్తి వివరాలు
ATM Withdrawal Rules : చేతిలో క్యాష్ అయిపోతే వెంటనే ఏటీఎంకు వెళ్లడం చాలామందికి అలవాటు. అవసరమైనప్పుడు డబ్బులు తీసుకోవడం ఎంత కామనో.. ఏటీఎం ఛార్జీల గురించి పెద్దగా పట్టించుకోకపోవడం కూడా అంతే కామన్.
అయితే, నెలలో ఎన్నిసార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు? ఎప్పటి నుంచి బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయి? పీఓఎస్ మెషీన్లలోనూ నగదు తీసుకోవచ్చా? ఇలాంటి విషయాలు ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి తెలియాలి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం.. ఖాతాదారులు తమ బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికి వస్తే.. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 3 ఉచిత లావాదేవీలు మాత్రమే ఉంటాయి. ఇతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంది.
అలాగే, క్యాష్ తీసుకోవడమే కాదు.. బ్యాలెన్స్ చెక్ చేసినా ఉచిత లావాదేవీల లెక్కలోకి వస్తుంది. ఉచిత పరిమితి దాటితే ఒక్కో అదనపు లావాదేవీకి బ్యాంకులు గరిష్ఠంగా రూ.23 ఛార్జీ వసూలు చేయవచ్చు. దీనికి పన్నులు అదనం కూడా.. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా రూ.10వేలు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు.
ఇలా కూడా ఛార్జీ పడుతుందా? :
ఏటీఎంలో డబ్బులు రాకపోయినా ఛార్జీ పడుతుందా? సాధారణంగా సాంకేతిక సమస్యలు, కనెక్టివిటీ ఇబ్బందులు, ఏటీఎంలో నగదు లేకపోవడం వంటి కారణాలతో లావాదేవీ విఫలమైతే ఎలాంటి ఛార్జీ విధించకూడదు. అలాంటి లావాదేవీలను ఉచిత పరిమితిలోనూ లెక్కించకూడదు..
ఇక పీఓఎస్ టెర్మినల్స్‌లో కూడా క్యాష్ తీసుకోవచ్చు. ఒక్కోసారి గరిష్ఠంగా రూ.2వేలు, నెల మొత్తంలో రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి వ్యాపార సంస్థలు గరిష్ఠంగా ఒక శాతం ఛార్జీ వసూలు చేయవచ్చు. ఏటీఎంకు వెళ్లినప్పుడల్లా లావాదేవీల సంఖ్య గుర్తుంచుకోండి. చిన్న నిర్లక్ష్యం చేసినా మీ ఖాతాలో అదనపు ఛార్జీలు పడతాయి జాగ్రత్త..




