- హైదరాబాద్ పాలనలో కీలక మార్పులు..
- హెచ్ఎండీఏ నుంచి మెట్రో వరకు కొత్త అధికారులు
- ఒకేసారి 8 మంది అధికారుల బదిలీ..
- కీలక శాఖల్లో ప్రభుత్వం ప్రక్షాళన
Telangana IAS Transfer : హైదరాబాద్ మహానగర అభివృద్ధి, పరిపాలనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నగరంలో కీలకంగా ఉన్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైల్, మూసీ రివర్‌ఫ్రంట్ వంటి విభాగాల పనితీరును మరింత పరుగులు పెట్టించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా 8 మంది ఐఏఎస్, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో ఆయా శాఖల్లో కొత్త బాధ్యతలు, కొత్త సమన్వయం మొదలుకానుంది..
హెచ్ఎండీఏలో కీలక మార్పులు :
ఇప్పటివరకు హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్‌కు మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ప్రభుత్వ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో ఈవీ నరసింహారెడ్డిని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా నియమించింది. అలాగే, శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా ఉన్న ఎం.ఎస్. చంద్రకళను హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ చేసింది..
మెట్రో, జీహెచ్ఎంసీలోనూ కొత్త నియామకాలు :
హైదరాబాద్ మెట్రో రైల్ బాధ్యతల్లోనూ మార్పులు జరిగాయి.. ఇన్వెస్ట్ తెలంగాణ, ఐ అండ్ సీ విభాగం సీఈవోగా ఉన్న బి. అజిత్ రెడ్డికి మెట్రో రైల్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ జాయింట్ ఎండీగా ఉన్న మయాంక్ మిట్టల్‌కు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బాధ్యతలు ఇచ్చింది..
ఇతర శాఖల్లోనూ బదిలీలు :
బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా ఉన్న మనోజ్‌ను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ ఎండీగా నియమించింది. పి. రామును విద్యాశాఖలో స్పెషల్ ఆఫీసర్ (ప్రాజెక్ట్స్)గా బదిలీ చేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న పి. శ్రీనివాస్ రెడ్డిని మాతృశాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.హైదరాబాద్ అభివృద్ధి, నగర పరిపాలనకు సంబంధించిన కీలక విభాగాల్లో ప్రభుత్వం కొత్త బాధ్యతలను కేటాయించింది..




