- ప్రతి ఓటూ కీలకమే.. పార్టీ శ్రేణులకు లోకేశ్ దిశానిర్దేశం
- పనిచేసిన వారికే పదవుల్లో ప్రాధాన్యత.. నేతలకు లోకేశ్ భరోసా
- పంచాయతీ పోరులో మరోసారి జెండా ఎగరేయాలి..
Nara Lokesh : రాజకీయాల్లో పదవులు ఆశించడం సహజం.. కానీ, పార్టీ కోసం కష్టపడిన వారికి సరైన గుర్తింపు దక్కాలన్నదే నాయకత్వం ఆలోచన.. ఇప్పుడు ఇదే అంశంపై మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు..
క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా సమర్థంగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల విషయంలో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది..
రెండో విడత పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కూటమి విజయమే లక్ష్యంగా లోకేశ్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.. ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎన్నికల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు.. ఎన్నికల్లో గెలుపు అనేది చివరి నిమిషంలో చేసే హడావుడితో రాదని, ముందునుంచే పక్కా ప్రణాళికతో అడుగులు వేయాలని స్పష్టం చేశారు..
ప్రతి ఓటు కీలకమే :
ప్రతి ఓటును కీలకంగా భావించాలని, బూత్ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించుకోవాలని చెప్పారు. ముఖ్యంగా రెబల్స్ సమస్యలను స్థానిక నాయకత్వమే చొరవ తీసుకుని పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు..
కూటమి పార్టీల మధ్య సమన్వయం కూడా ఈ ఎన్నికల్లో కీలకం కానుంది. ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి పూర్తిస్థాయిలో బదిలీ అయ్యేలా నాయకులు కలిసి పనిచేయాలని లోకేశ్ స్పష్టం చేశారు. ఎక్కడా సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు.
మొదటి విడత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రెండో విడతలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల గెలుపుతో పాటు కష్టపడే నాయకులకు గుర్తింపు ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చారు.




