హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ దంచికొట్టిన వాన.. నేడు ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. హెచ్చరికలు జారీ

Must read

Hyderabad Rains : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో పలు ప్రాంతాల్లోని రహదారులు జలమయం అయ్యాయి.

ఎలాంటి సూచనలు లేకుండా అర్ధరాత్రి వేళ భారీ వర్షం కురవడంతో ఉదయాన్నే పలు పనులపై బయటకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి 2గంటల నుంచి శుక్రవారం ఉదయం కూడా వర్షం కురిసింది. ముఖ్యంగా పశ్చిమ, ఈశాన్య హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నగరంలోని అమీర్‌పేట్, సనత్‌నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, గచ్చిబౌలి, కొండాపూర్, బేగంపేట్, బాలానగర్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, కూకట్ పల్లి, కాప్రా, మల్కాజిగిరి వంటి ప్రధాన ప్రాంతాలతోపాటు ఉప్పల్, నాగోల్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్ ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం వరకు ఆయా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా.. ఈదురుగాలులు, వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

ఇదిలాఉంటే.. . గురువారం రాత్రి నుంచి నాగర్ కర్నూల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నాగర్ కర్నూల్ జిల్లాలో నమోదైంది. తాడూరు మండలం యంగంపల్లిలో 4.5 సెంటీమీటర్లు, కల్వకుర్తి మండలం తోటపల్లిలో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఊర్కొండలో 1.2, నాగర్ కర్నూల్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 11 కేంద్రాల్లో వర్షం పడగా.. వట్‌పల్లిలో 4 సెంటీమీటర్లు, చౌటకూర్‌లో 2 సెంటీమీటర్ల వాన కురిసింది. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట మండలం ఫిల్మ్‌నగర్ (గౌతమ్ నగర్ ఫంక్షన్ హాల్) వద్ద 0.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article