ఏపీకి మళ్లీ తుపాను ముప్పు..! బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఏపీఎస్‌డీఎంఏ కీలక ప్రకటన!

Must read

AP Weather Alert : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ వచ్చింది. ఇటీవల రాష్ట్రంలో వరుస తుపాన్లు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే తుపాను ప్రభావిత ప్రాంతాలు తేరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి మరో తుపాను ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో వాతావరణ హెచ్చరిక వెలువడింది. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. అనంతరం ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.

దక్షిణ అండమాన్ సముద్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి డిసెంబర్ 2 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని వాతావరణ అంచనాలు సూచిస్తున్నాయి.

అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఈ క్రమంలో తమిళనాడు లేదంటే శ్రీలంక తీరాల వైపు పయణించవచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, వాతావరణ నమూనాల ప్రకారం ఈ వ్యవస్థ సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దీని గమనంపై వాతావరణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడకముందే దాని గమనం, తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది ఏ దిశగా పయనిస్తుంది? వాయుగుండంగా ఎంత బలపడుతుంది? తీర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే అంశాలపై తదుపరి వాతావరణ అంచనాలు కీలకం కానున్నాయి.

మరోవైపు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవవచ్చని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు.

తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టనున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇవాళ సాయంత్రం కూడా నగరంలోని మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు.. రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article