TTD Assets : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భక్తుల కానుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం సంపద రోజురోజుకూ పెరుగుతోంది. బంగారు ఆభరణాలు, వజ్రాలు, వెండి, భూములు, భవనాలు, బ్యాంకు డిపాజిట్లు.. ఇలా టీటీడీ ఆస్తుల జాబితా భారీగానే ఉంది. కొన్ని అంచనాల ప్రకారం.. తిరుమల శ్రీవారి ఆస్తుల విలువ ఏకంగా రూ.5 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. దీంతో దేశంలోని ఎన్నో దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువను మించిన సంపద గోవిందుడి సొంతమన్నమాట!
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. గణాంకాల ప్రకారం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ సుమారు రూ.4.72 లక్షల కోట్ల నుంచి రూ.4.89 లక్షల కోట్ల మధ్య ఉంది. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.4.62 లక్షల కోట్లు కాగా, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ విలువ రూ.4.44 లక్షల కోట్ల నుండి 4.46 లక్షల కోట్ల మధ్య ఉంటుంది.
అలాగే యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.4.41 లక్షల కోట్ల నుంచి రూ.4.43 లక్షల కోట్ల మధ్య ఉండగా.. మారుతీ సుజుకీ విలువ రూ.4.40 లక్షల కోట్లుగా ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా విలువ రూ.4.18 లక్షల కోట్ల నుంచి రూ.4.34 లక్షల కోట్ల మధ్య ఉంది. టైటాన్ కంపెనీ మార్కెట్ విలువ 4.12లక్షల కోట్ల నుంచి 4.01 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. ఇక అదానీ పవర్ మార్కెట్ విలువ 4లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఐటీసీ, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థల మార్కెట్ విలువలు రూ.4 లక్షల కోట్ల కంటే తక్కువగానే ఉన్నాయి.
భూముల మార్కెట్ విలువ పెరుగుదల, బంగారం ధరల కారణంగా అనధికారిక అంచనాల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విలువ 5లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి.. భక్తులు అత్యంత విలువైన బంగారు ఆభరణాలు తయారు చేయించి స్వామివారికి విరాళంగా ఇచ్చారు. టీటీడీకి భక్తులు హుండీ ద్వారానే కాకుండా అన్నప్రసాదం, ప్రాణదాన, బర్డ్, గోసంరక్షణలాంటి ట్రస్టులకు భారీగా విరాళాలు అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీటీడీ దగ్గర 11వేల 3వందల కిలోలకు పైగా బంగారం, 10 టన్నుల వెండి నిల్వలు.. అలాగే 19 వేల కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సగటున ప్రతి నెలా హుండీ ద్వారా 100 కోట్ల నుంచి 130 కోట్ల రూపాయల నగదు, 100 కిలోలకు పైగా బంగారం శ్రీవారికి కానుకలుగా అందుతోంది. దీంతో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ కంటే టీటీడీ ఆస్తుల విలువ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్ తిరుమల శ్రీవారికి 121 కిలోల స్వర్ణాభరణాలను విరాళంగా అందించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు రూ.160 కోట్ల విలువైన ఈ ఆభరణాలు శ్రీవారి అలంకరణకు మరింత శోభను తీసుకురానున్నాయి. ఈ భారీ విరాళం నేపథ్యంలో టీటీడీ దగ్గర ఉన్న బంగారం, ఆస్తులు, బ్యాంకు డిపాజిట్ల లెక్కలపై మరోసారి ఆసక్తి పెరిగింది.




