త్వరలో మరో 25 వేల ఉద్యోగాలు.. అచ్చంపేట సభలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Must read

Cm Revanth Reddy: అచ్చంపేట గడ్డ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా నిలుపుతానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వీరమాంబ, అచ్చమ్మ వంటి మహనీయుల పోరాట వారసత్వాన్ని ఈ నేల కొనసాగిస్తోందని కొనియాడారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము చేసిన తప్పులకు ప్రజలకు ముఖం చూపించలేకే కేసీఆర్ బయటకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులకు పదవులు పంచుకుని, అధికారం కోల్పోగానే ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. అధికారం లేకపోతే ప్రజల తరఫున ప్రశ్నించకూడదా, బయటకు రాకూడదా అని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు.

రైతులు, ఉద్యోగాలపై సీఎం హామీలు.. బతుకమ్మ చీరలపై సెటైర్లు:

గత మూడేళ్లలో దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని, రైతుల సంక్షేమం కోసం ఈ మూడేళ్లలో రూ.1.78 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో కేసీఆర్ పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను మహిళలు ఎవరూ కట్టుకోలేదని, సూరత్ నుంచి కిలోల చొప్పున తీసుకువచ్చి చీరల పంపిణీలోనూ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆ చీరలు పొలాలకు చుట్టేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

పాలమూరు ప్రాజెక్టులు, కృష్ణా జలాలపై కీలక వ్యాఖ్యలు:

పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ పదేళ్ల పాటు నిర్లక్ష్యం చేసి, కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేశారని రేవంత్‌రెడ్డి(Cm Revanth Reddy) ఆరోపించారు. రోజా వడ్డిన రొయ్యల పులుసు తిని రాయలసీమ రతనాలసీమ కావాలని వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. పదేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే నేడు కృష్ణా నీళ్లు ఏపీ వైపు వెళుతున్నాయని అన్నారు. పాలమూరు ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నీటిని తోడుకునే అవకాశం ఉండేదని, పాలమూరు బిడ్డగా ఈ ప్రాజెక్టుల పూర్తి బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article