CM Chandrababu : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అదేవిధంగా 23 పట్టణ స్థానిక సంస్థల్లోనూ పోలింగ్ కొనసాగుతోంది. పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, నారా బ్రాహ్మణిలతో కలిసి మంగళగిరి -తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉదయాన్నే కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలోని ఎంపీయూసీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. బాధ్యత కలిగిన ప్రతి పౌరుడూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిక చేసుకున్న నాయకుడి వల్ల ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఓటు వేస్తేనే ఏదైనా అడిగే హక్కు ఉంటుందన్న చంద్రబాబు.. డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే ప్రజలకు మరింత మంచి జరిగే ఆస్కారం ఉంటుందని, బలంగా ప్రశ్నించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.




