ఏపీలో కొనసాగుతున్న తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. ఉదయాన్నే ఓటర్ల బారులు..

Must read

AP Gram Panchayat Elections 2026 : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభంకాగా.. మధ్యాహ్నం 1గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభిస్తారు. రాత్రి వరకు ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఇదిలాఉంటే.. తొలి దశలో 3,949 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట నోటిఫికేషన్‌ ఇచ్చింది. వీటిలో 709 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 3,240 పంచాయతీలు, 25,101 వార్డులకు ఇవాళ పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం 62,863 మంది పోటీలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. 6,303 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 536 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఉండనుంది.

ఇదిలాఉంటే.. పంచాయతీ ఎన్నికల్లో చెరగని సిరా వినియోగంపై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమచేతి చిటికెన వేలుపై సిరా వేస్తారని తెలిపింది. ఇటీవల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. పోలింగ్‌లో మార్పులు, రీపోలింగ్ వల్ల కొన్ని కేంద్రాల్లో ఎడమ చేతి మధ్య వేలుపైనా సిరా గుర్తుకు ఆదేశమిచ్చారు. అప్పటి సిరా గుర్తు ఓటర్ల వేళ్లపై ఇంకా ఉన్నందున ఎస్ఈసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు.. 23 పట్టణ స్థానిక సంస్థలకు నేడు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థల్లో మేయర్, 19 పురపాలక, నగర పంచాయతీల్లో ఛైర్‌పర్సన్‌ స్థానాలకు 170 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేయర్‌ స్థానాలకు 36, ఛైర్‌పర్సన్‌ స్థానాలకు 134 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 964 డివిజన్లు, వార్డుల్లో 2,968 మంది బరిలో ఉన్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 30వ తేదీన ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article