పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బియ్యం ధరలు.. కారణాలివే..!

Must read

Rice Prices Drop 10 Rupees Per KG BPT Rice : తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావంతోపాటు.. పలు ప్రాంతాల్లో వ్యాపారుల కృత్రిమ కొరత కారణంగా బియ్యం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కిలో బియ్యం రూ. 100కు చేరువైంది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు బియ్యం కొనాలంటే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది. అయితే, సర్కార్ చర్యలతో బియ్యం ధరలు దిగొచ్చాయి. మార్కెట్లో డిమాండ్‌ తగ్గటంతో నెలరోజుల వ్యవధిలో కిలోకు రూ.10 చొప్పున తగ్గాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌‌లో సాగు విస్తీర్ణం తగ్గటం, తద్వారా వరి ఉత్పత్తి, దిగుబడి కూడా తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో నెల రోజుల క్రితం రైస్‌మిల్లర్లు, దళారులు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులు ఒక్కసారిగా బియ్యం ధరలు పెంచారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఉత్పత్తి చేసిన ధాన్యం, బియ్యం ఇంకా చేతికిరాకముందే… మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించారు. ఇప్పుడు బియ్యం కొనకపోతే మరో ఏడెనిమిది నెలల దాకా బియ్యం దొరకవనే వాతావరణాన్ని సృష్టించారు. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఈ క్రమంలో సన్నబియ్యాన్ని వ్యాపారులు కిలోకు రూ.100 చొప్పున కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు.

బియ్యం ధరలు భారీగా పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ప్రభుత్వం రంగంలోకిదిగి బియ్యం ధరలపై నియంత్రణ చర్యలను ప్రారంభించింది. వినియోగదారులు ఎక్కువగా కొనే సన్నబియ్యానికి ధరలు ప్రకటించింది. షాపుల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయించటం, అక్రమ నిల్వలపై పౌరసరఫరాల శాఖ అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వహించడం వంటి చర్యలతో రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు దందాకు బ్రేక్ పడింది. ప్రభుత్వం చర్యలతో మార్కెట్లో డిమాండ్ తగ్గటంతో నెలరోజుల వ్యవధిలో బియ్యం ధరలు కిలోకు రూ.10 చొప్పున తగ్గాయి. ధరలు తగ్గటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

వినియోగదారులు ఎక్కువగానే కొనుగోలు చేసే సన్నబియ్యానికి ప్రభుత్వం ధరలను ప్రకటించింది. బీపీటీ, కేఎన్‌ఎం(కూనారం) సన్నాలను కిలోకు రూ.66 మించి, తెలంగాణసోనా/ఆర్‌ఎన్‌ఆర్‌ రకాలను రూ.74కు మించి, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్‌ బియ్యాన్ని కిలోకు రూ.79కి మించి అమ్మొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరల పట్టిక పోస్టర్లను మార్కెట్లో ఉన్న అన్ని షాపుల ముందు అంటించేలా చర్యలు తీసుకొని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ధరలు అదుపులోకి వచ్చాయి. వివిధ రకాలపై సగటున కిలోకు రూ.10 మేర ధరలు తగ్గాయి.

ఇదిలాఉంటే.. మార్కెట్‌ ధరలతో పోల్చితే ఆన్‌లైన్‌లో బియ్యం ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. మార్కెట్లో ధరల నియంత్రణ చేపట్టినట్లుగానే… ఆన్‌ లైన్‌ బియ్యం ధరలకు కూడా కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article