Uttam Kumar Reddy: ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తావన లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి క్రెడిట్ వార్ మొదలైన వేళ, కేటీఆర్ వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) అంతే ఘాటుగా బదులిచ్చారు. అసలు సోనియాగాంధీ గట్టి నిర్ణయం తీసుకోకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఏర్పడేది కాదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ, ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొని ఆమె తెలంగాణను ఇచ్చారన్న చారిత్రక సత్యాన్ని ఎవరూ చెరిపివేయలేరని మంత్రి హితవు పలికారు.
సోనియా వల్లే మీ కుటుంబానికి మేలు జరిగింది.. పదవులు వచ్చాయి:
కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది మీ కుటుంబమేనని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే మీ కుటుంబానికి మేలు జరిగిందని, పదేళ్ల పాటు అధికారంతో పాటు ఉన్నత పదవులు దక్కాయని ఆయన గుర్తు చేశారు. ఆ కృతజ్ఞతను పూర్తిగా మరిచిపోయి, ఇవాళ సోనియాగాంధీపైనే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని మంత్రి సూటిగా ప్రశ్నించారు.
ఆత్మకథలో లేకుంటే ఏంటి.. సోనియా హృదయంలో తెలంగాణ ఉంది:
పుస్తకాల్లో ప్రస్తావన ఉన్నా లేకపోయినా వాస్తవాలు మారిపోవని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. “ఆత్మకథలో లేకుంటే ఏంటి.. సోనియాగాంధీ హృదయంలోనే తెలంగాణ ఉంది” అని ఆయన భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. కేవలం సోనియాగాంధీ దృఢ సంకల్పం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందనే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని మంత్రి చురకలంటించారు.


