Indiramma Bhima Scheme: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత, భరోసా కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా(Indiramma Bhima Scheme)’ పథకం అమలుకు సర్వం సిద్ధమైంది. గత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకుంటూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా కేంద్రం వేదికగా ఈ కీలక సంక్షేమ పథకానికి అధికారికంగా శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల వరకు జీవిత బీమా రక్షణ లభించనుంది. అనుకోని ఆపద సమయంలో కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయే, దిక్కుతోచని స్థితిలో పడే పేద వర్గాలకు ఈ బీమా పథకం కొండంత అండగా నిలవనుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు:
సిద్దిపేట పర్యటనలో భాగంగా జిల్లా సమగ్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చే ఈ నూతన బీమా పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గడపకూ చేరవేయాలని, విస్తృత ప్రచారం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం, జిల్లా మంత్రులు, కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
హరీశ్‌రావు నియోజకవర్గంలో సీఎం పర్యటనపై తీవ్ర రాజకీయ ఆసక్తి:
మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నెలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన సీఎం, ఇప్పుడు మాజీ మంత్రి హరీశ్‌రావు కంచుకోట అయిన సిద్దిపేటలో అడుగుపెట్టడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానమివ్వడంతో పాటు, పలు కీలక రాజకీయ అంశాలపై ప్రసంగించే అవకాశం ఉందని కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే సంకేతాలు ఇవ్వడం గమనార్హం.


