ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం.. విడుదలైన తుది దశ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే!

Share

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పోరు రసవత్తరంగా సాగుతూ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి అభ్యర్థుల తుది జాబితా ఖరారు కాగా, రెండో దశకు బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా తుది దశ పంచాయతీ(AP Panchayat Elections) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు నేడు విడుదల చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎల్లుండి అనగా ఈనెల 21 నుంచి ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తుది దశ నామినేషన్లను స్వీకరించనుండగా, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు వివరాలు ఇవే!

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ చేపట్టనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు లేదా అప్పీళ్లు దాఖలు చేసేందుకు 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చి, 26వ తేదీన వాటిని పరిష్కరించనున్నారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించి, అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

డిసెంబర్ 2న పోలింగ్, మధ్యాహ్నమే ఫలితాలు.. ఏర్పాట్లపై అధికారుల దృష్టి:

తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఒకవేళ అనివార్య కారణాలతో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే, డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.

Read more

Local News