హాస్టల్ ముసుగులో అండాల దందా.. ప్రమాదకర హార్మోన్ ఇంజెక్షన్లతో అండాల సేకరణ.. 12 మంది మహిళలకు విముక్తి!

Must read

Egg Harvesting Racket: హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర అక్రమ అండాల సేకరణ, విక్రయ రాకెట్ గుట్టును ఓ సామాన్య టీకొట్టు యజమాని అప్రమత్తత బట్టబయలు చేసింది. బేగంపేటలోని ప్రకాశనగర్ ఎక్స్‌టెన్షన్ సమీపంలోని నజ్రాన్ అపార్ట్‌మెంట్‌లో ‘అమి నితా గర్ల్స్ హాస్టల్’ ముసుగులో గత రెండేళ్లుగా ఈ దారుణ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్ శర్మ, నిఖత్ శర్మ దంపతులు ఈ భవనంలోని ఐదు పోర్షన్లను నెలకు రూ.50 వేల అద్దెకు తీసుకొని ఈ అక్రమ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఈ హాస్టల్ తలుపులు ఎప్పుడూ మూసే ఉండటం, లోపల ఉండే అమ్మాయిలెవరూ కాలేజీలు లేదా ఆఫీసులకు వెళ్లకపోగా, తరచూ కొందరు పురుషులు, వైద్య సిబ్బంది, హార్మోన్ ఇంజెక్షన్ల బాక్సులతో కూడిన వాహనాలు లోపలికి వెళ్లడాన్ని భవనం ఎదురుగా ఉన్న టీకొట్టు యజమాని గమనించాడు. ఈ కదలికలపై అనుమానం రావడంతో అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

ఒక్కో అండానికి రూ.65 వేల ఆశ.. ప్రమాదకర హార్మోన్ ఇంజెక్షన్లతో నరకం:

టీకొట్టు వ్యాపారి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన మల్కాజిగిరి ఎస్‌ఓటీ, బేగంపేట పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించి, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 12 మంది నిరుపేద మహిళలకు విముక్తి కల్పించారు. ఒక్కో అండానికి(Egg Harvesting Racket) రూ.65 వేల వరకు ఇస్తామని ఆశచూపి పొరుగు రాష్ట్రాల నుంచి పేద మహిళలను హైదరాబాద్‌కు రప్పించి, ఒకే మహిళ నుంచి పదేపదే అండాలు సేకరించేందుకు నిందితులు ప్రమాదకరమైన హార్మోన్ ఇంజెక్షన్లు, మాత్రలు ఇస్తున్నట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్‌లోని పద్మజ, నర్మద, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లలో ఈ అక్రమ వైద్య ప్రక్రియలు నిర్వహించేవారని పోలీసులు గుర్తించారు.

‘సృష్టి’ అక్రమ సరోగసీ కేసుతోనూ లింకులు.. వైద్యుల పాత్రపై విచారణ:

ఈ రాకెట్‌కు సంబంధించి పోలీసులు నాలుగు కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 10 మంది నిందితులను అరెస్ట్ చేయగా, ఇందులో కొందరు వైద్యుల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, గతంలో సికింద్రాబాద్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన అక్రమ సరోగసీ కేంద్రం ‘సృష్టి ఫెర్టిలిటీ సెంటర్’ కేసు నిందితులతోనూ ఈ నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నట్లు, కొందరు యువతులను అక్రమ సరోగసీ కోసం కూడా వినియోగించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించాయి.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!