Amit Shah: జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాద శక్తులపై భారత భద్రతా దళాలు మరో భారీ, నిర్ణయాత్మక విజయాన్ని నమోదు చేశాయి. కుల్గాం జిల్లా జంగల్పోరా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ మరియు నిఘా సంస్థలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో మోస్ట్ వాంటెడ్ లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది లతీఫ్ భట్ హతమయ్యాడు. కాశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్న చివరి స్థానిక ఉగ్రవాదిని మట్టుబెట్టడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ బలగాల ధైర్యసాహసాలను కొనియాడారు. అంతకుముందు రోజు ఇదే జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో లతీఫ్ ప్రధాన సహచరుడు ఉమర్ నిసార్ సైతం హతమైనట్లు ఆయన తన పోస్టులో వెల్లడించారు.
మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా అత్యంత చాకచక్యంగా ఆపరేషన్:
జంగల్పోరాలోని ఓ మసీదులో నక్కిన లతీఫ్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు భద్రతా బలగాలు వీడియో కాల్ ద్వారా లొంగిపోవాలని కోరాయి. అయితే లొంగిపోయేందుకు నిరాకరించిన అతను, తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ క్రమంలో మసీదు కట్టడానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా బలగాలు అత్యంత జాగ్రత్తగా టియర్ గ్యాస్ ప్రయోగించి, అతను బయటకు రాగానే ఎదురుకాల్పుల్లో హతమార్చినట్లు ఎస్ఎస్పీ అనాయత్ అలీ స్పష్టం చేశారు.
ఉగ్రబాట పట్టిన ఏడాదికే ముగిసిన లతీఫ్ ప్రస్థానం!
2025 నవంబర్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలో చేరిన లతీఫ్ భట్, పాకిస్తాన్ నుంచి అందే ఆదేశాలతో స్థానిక ఆర్థిక వ్యవస్థను, పర్యాటక రంగాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడ్డాడు. ఇటీవల సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడికి ప్రధాన సూత్రధారి అయిన ఇతను, ఉగ్రవాదంలో చేరిన ఏడాదికే భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.


