Cold Wave In Telangana: తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతూ ప్రజలను గజగజ వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతుండటంతో సామాన్య జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డవగా, గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పటాన్చెరులో 12.4, రాజేంద్రనగర్‌లో 13.0 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే శివ్వంపేటలో 13.3, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 13.4, తిర్యాణిలో 13.6, కెరమెరి, వాంకిడి మండలాల్లో 15.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
హైదరాబాద్ నగరంలోనూ చలి పంజా.. రహదారులపై దట్టమైన పొగమంచు:
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ చలిగాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. తెల్లవారుజామున ప్రధాన రహదారులను దట్టమైన పొగమంచు కప్పేస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి(Cold Wave In Telangana) తీవ్రత తగ్గకపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు స్వెట్టర్లు, మాస్కులు ధరించి బయటకు వస్తున్నారు. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టడంతో మధ్యాహ్నం వేళల్లో సైతం చల్లని గాలులు వీస్తున్నాయి.
డిసెంబర్లో మరింత పెరగనున్న చలి.. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్త:
గతేడాది నవంబర్‌తో పోలిస్తే క్యూర్ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, చలిగాలుల తీవ్రత మాత్రం అధికంగా ఉందని బేగంపేట వాతావరణ శాఖ వెల్లడించింది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, డిసెంబర్ నాటికి చలి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వాతావరణ మార్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.


