రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి.. ఏటా నవంబర్ 16న అధికారికంగా ఉత్సవాలు.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు!

Must read

Ap Government: రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపకుడు, దివంగత పద్మవిభూషణ్ రామోజీరావు తెలుగు జాతికి, రాష్ట్రానికి అందించిన విశిష్ట సేవలకు గౌరవసూచకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన జయంతిని ఏటా నవంబర్ 16వ తేదీన ‘రాష్ట్ర పండుగ’గా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల నిర్వహణ బాధ్యతను యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ (Ap Government)శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

తరతరాలకు స్ఫూర్తి ప్రదాత రామోజీరావు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు:

అంతకుముందు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ వేదికపైనే ఆయన రామోజీరావు జయంతిని ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సభముఖంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రామోజీరావు తెలుగుజాతి కీర్తి అని, రాబోయే తరతరాలకు ఆయన జీవిత ప్రస్థానం ఒక గొప్ప స్ఫూర్తి అని కొనియాడారు. మీడియా, సినీ, వ్యాపార రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు.

యువతకు ఆదర్శం.. ఆయన సంకల్పానికి ఎదురేలేదు:

ఎవరికీ తలవంచని అకుంఠిత దీక్ష, ధైర్యసాహసాలు రామోజీరావు సొంతమని, ఆయన ఏదైనా సంకల్పిస్తే దానికి ఎలాంటి అవరోధం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే నేటి యువత ఆయన జీవిత చరిత్రను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తద్వారా కష్టపడే తత్వాన్ని అలవర్చుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సీఎం యువతకు దిశానిర్దేశం చేశారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!