శబరిమల అయ్యప్ప భక్తులకు కీలక అప్‌డేట్.. తెరుచుకోనున్న ఆలయ తలుపులు.. రోజుకు 80 వేల మందికే దర్శనం

Must read

Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులు ఏడాది పొడవునా అత్యంత భక్తిశ్రద్ధలతో ఎదురుచూసే వార్షిక మండల యాత్రా సీజన్‌కు శబరిమల ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. సోమవారం (నవంబర్ 16) సాయంత్రం 5 గంటలకు తంత్రి కందారు బ్రహ్మదాతన్ సమక్షంలో ప్రస్తుత మేల్శాంతి (ప్రధాన పూజారి) ఇ.డి. ప్రసాద్ నంబూతిరి ఆలయ తలుపులను తెరిచి, లాంఛనప్రాయంగా దీపం వెలిగించి 18 పవిత్ర మెట్ల దిగువన ఆళి (పవిత్ర అగ్ని)ని వెలిగిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు నూతన మేల్శాంతి అరెక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూతిరికి పవిత్రోత్సవం నిర్వహిస్తారు. కాగా, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి నూతన ప్రధాన పూజారులు ఆలయ ద్వారాలు తెరవడంతో భక్తుల దర్శనాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.

రోజుకు 80 వేల మందికే అనుమతి.. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ తప్పనిసరి:

రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రావెన్‌కోర్ (Sabarimala)దేవస్వం బోర్డు ఈసారి కీలక నిబంధనలు అమలు చేస్తోంది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శన అవకాశం కల్పించనుండగా, ఇందుకోసం ముందస్తు ఆన్‌లైన్ బుకింగ్‌ను తప్పనిసరి చేశారు. కాబట్టి అయ్యప్ప భక్తులు ముందుగానే దర్శన స్లాట్ బుక్ చేసుకుని తమ యాత్రా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మండల పూజ, మకరవిళక్కు యాత్ర ముఖ్య తేదీలు ఇవే:

ఈ మండల యాత్రా సీజన్‌లో భాగంగా డిసెంబర్ 27న మండల పూజ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మకరవిళక్కు యాత్ర కోసం డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. జనవరి 14న మకరవిళక్కు పర్వదినం జరగనుండగా, జనవరి 19 వరకు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నట్లు దేవస్వం బోర్డు ప్రకటించింది.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!