5 Days Banking: వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అందింది. ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది. అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించడం వల్ల కస్టమర్ల సేవలకు ఎలాంటి ఆటంకం కలగదని కమిటీ అభిప్రాయపడింది. ఎలాంటి జాప్యం లేకుండా సమయబద్ధంగా చర్చలు పూర్తి చేసి, తక్షణమే 5 రోజుల (5 Days Banking)పనిదినాలను అమలు చేయాలని యూనియన్లు గట్టిగా డిమాండ్ చేశాయి.
సెప్టెంబర్ 27 ఆదివారం విధులపై ప్రత్యేక వేతనం.. సెలవుల విషయంలో ఊరట:
గత సెప్టెంబర్ 27, 2026 ఆదివారం నాడు పనిచేసిన ప్రైవేట్ బ్యాంకు అధికారులకు ప్రభుత్వ బ్యాంకు సిబ్బంది తరహాలోనే ఒక రోజు ప్రత్యేక వేతనం చెల్లించేందుకు ఐబీఏ అంగీకరించింది. అలాగే ఆరోజు వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరు కాని ఉద్యోగులను సెలవు దరఖాస్తులు అడగవద్దని బ్యాంకు యాజమాన్యాలకు సూచించనుంది.
వేతన సవరణ, పెన్షనర్ల సమస్యలపై ఐబీఏ సానుకూల స్పందన:
అక్టోబర్ 2027లో ముగియనున్న ప్రస్తుత వేతన సెటిల్మెంట్ గడువు నేపథ్యంలో తదుపరి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే కొత్త డిమాండ్ల కంటే ముందు పెండింగ్ సమస్యలు, పీఎల్ఐ (PLI) సవరణలు, ప్రైవేట్ బ్యాంకు పెన్షనర్ల ఎక్స్గ్రేషియా అంశాలను పరిష్కరించాలని యూనియన్లు కోరగా ఐబీఏ సానుకూలంగా స్పందించింది.


