Sabarimala Special Trains: శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) భారీ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. మండల, మకరవిళక్కు సీజన్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఏకంగా 54 ప్రత్యేక రైలు సర్వీసులను(Sabarimala Special Trains) నడపాలని నిర్ణయించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన స్టేషన్ల మీదుగా కేరళలోని కొల్లం వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
హైదరాబాద్, చర్లపల్లి నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా ప్రత్యేక సర్వీసులు:
ఈ ప్రత్యేక రైళ్లలో భాగంగా హైదరాబాద్ – కొల్లం (07193/07194) మధ్య డిసెంబర్ నెలలో శనివారం, సోమవారాల్లో 8 సర్వీసులు నడవనున్నాయి. అలాగే చర్లపల్లి – కొల్లం మధ్య నల్గొండ, మిర్యాలగూడ మీదుగా మూడు వేర్వేరు నంబర్లతో (07180/07181, 07195/07196, 07197/07198) నవంబర్ 20 నుంచి జనవరి 19 వరకు శుక్ర, ఆది, బుధవారాల్లో మొత్తం 38 సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.
కాజీపేట మీదుగా అదనపు రైళ్లు.. నాందేడ్ నుంచి ప్రత్యేక సర్వీసు:
మరోవైపు కాజీపేట మార్గంలో వెళ్లే భక్తుల కోసం చర్లపల్లి – కొల్లం (07199/07200) మధ్య డిసెంబర్ 30 నుంచి జనవరి 15 వరకు 6 ప్రత్యేక సర్వీసులను కేటాయించారు. వీటితో పాటు నవంబర్ 15న నాందేడ్ నుంచి కొల్లంకు (07189) ఒక ప్రత్యేక రైలు, నవంబర్ 17న కొల్లం నుంచి చర్లపల్లికి (07190) మరో ప్రత్యేక సర్వీసును నడపనున్నారు.
ఏసీతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌ల సదుపాయం:
ఈ ప్రత్యేక రైళ్లలో ఒకట్రెండు సర్వీసుల్లో పూర్తిగా ఏసీ బోగీలు ఉండగా, మెజారిటీ రైళ్లలో ఏసీ కోచ్‌లతో పాటు సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలను కూడా జతచేశారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుగానే టికెట్లు రిజర్వ్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.


