రూ.7 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామ్.. అరవింద్ కేజ్రీవాల్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Must read

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేస్తామంటూ వచ్చిన బెదిరింపులు దేశ రాజధాని రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా పేరుతో ఈ బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు చేపట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకుంటూ ఇటీవల ఒక గుర్తుతెలియని వ్యక్తి తనకు ఫోన్ చేశాడని ఢిల్లీలోని తిలక్ నగర్ ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు రూ.7 కోట్లు చెల్లించాలని, లేదంటే అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తెను కూడా అంతమొందిస్తామని ఆ వ్యక్తి తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాట్సప్ సందేశాలతో వేధింపులు.. కేజ్రీవాల్ కుటుంబానికి భద్రత పెంచాలని డిమాండ్:

ఫోన్ కాల్ అనంతరం నిందితుడు తనకు వాట్సప్ ద్వారా కూడా బెదిరింపు సందేశాలు పంపినట్లు ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు(Arvind Kejriwal), ఆయన కుటుంబ సభ్యులకు తక్షణమే కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తూ నిందితుడి ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు సాంకేతిక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖులకు కూడా ఇదే తరహా బెదిరింపులు.. రంగంలోకి ముంబయి పోలీసులు:

ఇటీవల బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులకు పాల్పడిన ఘటన సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన తర్వాత పలువురు హిందీ సినీ ప్రముఖులకు కూడా ఈ ముఠా నుంచి వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నటుడు తుషార్ కపూర్‌కు ‘హ్యారీ బాక్సర్’ పేరిట ఫోన్ చేసిన ఒక వ్యక్తి రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ హత్య బెదిరింపులకు దిగగా, తాజాగా నటుడు ఆయుష్మాన్ ఖురానాకూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో ముంబయి పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!