Yatindra Saptati: రంగారెడ్డి జిల్లా పరిధిలోని శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక యతీంద్ర సప్తతి (Yatindra Saptati)ఉత్సవాల్లో భాగంగా సమాజంలో నిస్వార్థ సేవలు అందిస్తున్న 70 మంది విశిష్ట మాతృమూర్తులకు శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి అమృత హస్తాల మీదుగా ఘన సన్మానం జరిగింది. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు సతీమణి శ్రీకుమారి, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త శైలజా కిరణ్, సివిల్స్ కోచ్ బాలలతతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళా మూర్తులను స్వామిజీ స్వయంగా శాలువాతో సత్కరించి ఆశీస్సులు అందించారు. సమాజ హితం కోసం నిశ్శబ్దంగా శ్రమిస్తున్న మహిళలను గుర్తించి గౌరవించడం ఎంతో ఆనందకరమని స్వామిజీ అన్నారు.
మహిళలకు ఆధ్యాత్మిక హక్కులు ఇచ్చిన రామానుజులు.. చిన్న జీయర్ స్వామి విశేష ప్రవచనం:
ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ.. భారతీయ సంప్రదాయం, వైదిక సంస్కృతిలో మహిళలకు అత్యున్నత గౌరవం, మర్యాద ఉన్నాయని స్పష్టం చేశారు. వేల సంవత్సరాల క్రితమే స్త్రీలకు మంత్రోపదేశంతో పాటు సమాన ఆధ్యాత్మిక హక్కులను కల్పించిన ఘనత భగవద్ రామానుజాచార్యులకే దక్కుతుందని కొనియాడారు. సమాజంలో మూఢనమ్మకాలు, లింగ వివక్ష తీవ్రంగా ఉన్న రోజుల్లోనే రామానుజులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆధ్యాత్మిక దార్శనికతను వివరించారు.
భగవంతుడి దృష్టిలో అందరూ సమానులే.. కుల, లింగ భేదాలపై స్వామిజీ హితవు:
సమాజ అభివృద్ధికి సమానత్వమే పునాది అని చాటిచెప్పిన రామానుజాచార్యులు, భగవంతుడి సృష్టిలో కుల, మత, లింగ భేదాలకు ఎంతమాత్రం తావులేదని స్పష్టం చేశారని స్వామిజీ వ్యాఖ్యానించారు. భగవంతుని దృష్టిలో మనుషులు, జంతువులు, పక్షులు అనే తేడాలు ఉండవని, ప్రతి ప్రాణిలోనూ దైవత్వాన్ని చూడటమే అసలైన మానవత్వమని హితవు పలికారు. మానవాళి అంతా ప్రేమ, కరుణతో మెలగాలని స్వామిజీ పిలుపునిచ్చారు.


