తెలంగాణ విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు.. వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Must read

Telangana Government: తెలంగాణ విద్యా వ్యవస్థలో నాణ్యతా ప్రమాణాలను పెంచడంతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడిన సీఎం, వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 10+2 విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విద్యా రంగంలో మార్పుల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి అత్యుత్తమ నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

9 నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేక విద్య.. నైపుణ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టి:

నూతన విద్యా సంస్కరణల్లో భాగంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బోధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి(Telangana Government) తెలిపారు. ముఖ్యంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యను ఉన్నత విద్యగా పరిగణించి, విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ (Specialised Education) అందించాలని స్పష్టం చేశారు. 12వ తరగతి నుంచే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే వృత్తి నైపుణ్యాలపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ దృఢ సంకల్పమని పేర్కొన్నారు.

మౌలిక వసతుల కల్పనకు ఆదేశాలు.. సమావేశానికి హాజరైన ఉన్నతాధికారులు:

ఈ నూతన విధానాల అమలుకు అవసరమైన మౌలిక వసతులను అన్ని పాఠశాలల్లో తక్షణమే కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా, సున్నితంగా ఈ మార్పులను తీసుకురావాలని ఆదేశించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ కీలక సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img

Latest article

error: Content is protected !!