AP Cabinet: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం(AP Cabinet) సుదీర్ఘ చర్చల అనంతరం ముగిసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, హోంశాఖ బలోపేతం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ఏపీ క్యాబినెట్ ఏకంగా 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలుపుతూ పచ్చజెండా ఊపింది. ఈ భేటీలో పలు శాఖలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలతో పాటు రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రతిష్టాత్మక పాలసీలకు మంత్రివర్గం స్పష్టమైన ఆమోదముద్ర వేసింది.
ఏఐ డేటా సెంటర్లు, ఏవీజీసీ పాలసీ.. భారీ పారిశ్రామిక ప్రాజెక్టులకు పచ్చజెండా:
రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ 2026-31 కాలానికి ఏపీ ఏవీజీసీ-ఎక్స్ఆర్ (AVGC-XR) పాలసీతో పాటు 2036 వరకు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ జిల్లా భీమిలి మండలం అమనాంలో 512 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు, సెమీకండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ-4.0 సవరణలకు అంగీకరించింది. అలాగే అన్నమయ్య జిల్లాలో ఫుట్వేర్ కాంపోనెంట్ పార్కు, ఎన్టీఆర్ జిల్లా జయంతిపురంలో FLO మహిళా పారిశ్రామిక పార్కు, నాయుడుపేటలో లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
ప్రత్యేక ట్రాఫిక్ డైరెక్టరేట్ ఏర్పాటు.. విజయం తలకెక్కించుకోవద్దని మంత్రులకు సీఎం సూచన:
రవాణా రక్షణను మెరుగుపరిచేందుకు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ సేఫ్టీ డైరెక్టరేట్ ఏర్పాటుకు హోంశాఖ ప్రతిపాదనను ఆమోదించారు. భేటీ అనంతరం సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని ఎవరూ తలకెక్కించుకోవద్దని స్పష్టం చేశారు. నాయకులు, మంత్రులు మరింత బాధ్యతతో వ్యవహరిస్తూ 2029 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో పటిష్ఠంగా పనిచేయాలని హితవు పలికారు.


