Telangana Civil Supplies: తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో వస్తున్న వార్తలపై పౌరసరఫరాల శాఖ తీవ్రంగా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్లు, అసత్య ప్రచారాలు మాత్రమేనని తేల్చిచెప్పిన అధికారులు, ప్రజలు ఎవరూ అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. మార్కెట్లో తగినంత బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించి లాభపడాలని చూసే వారిపై కఠిన నిఘా ఉంచామని వెల్లడించారు.
దళారుల అక్రమాలపై ఆగ్రహం.. డైరెక్ట్‌గా మిల్లర్ల నుంచే బియ్యం కొనుగోలు:
కొందరు దళారులు కావాలనే మార్కెట్లో అభద్రతా భావాన్ని సృష్టించి, ధరలను అదనంగా పెంచి అమ్ముతున్నారని పౌరసరఫరాల శాఖ(Telangana Civil Supplies) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రిటైల్ వ్యాపారులకు కీలక సూచనలు చేసింది. రిటైలర్లు ఇకపై మధ్యవర్తులు లేదా హోల్‌సేల్ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం లేదని, నేరుగా రైస్ మిల్లర్ల నుంచే బియ్యాన్ని తెప్పించుకోవచ్చని స్పష్టం చేసింది. దీనివల్ల మధ్యవర్తుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడింది.
తప్పుడు లేబుళ్లు, కృత్రిమ కొరతపై హెచ్చరిక.. కఠిన చర్యలు తప్పవు:
వ్యాపారులు నాణ్యత, పరిమాణంలో మోసాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా 25 కేజీల బియ్యం బస్తాపై 26 కేజీల స్టిక్కర్ వేసి విక్రయించినా లేదా మార్కెట్లో కృత్రిమంగా కొరత సృష్టించి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసినా వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


